గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల పురోగతి, ఆదాయం తదితర అంశాలను డీఆర్ఎం మోహనరాజ వివరించారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలో రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని చెప్పారు. ప్యాసింజర్ రైళ్లు ఎక్కువగా నడిపేందుకు అవకాశం లేక సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. గతేడాది కన్నా ఎగుమతులు పెరిగాయని, ప్రధానంగా మిర్చి, పసుపు, అల్లం వంటి ఆహార ఉత్పత్తులు ఎక్కువగా రవాణా అవుతున్నట్లు మోహనరాజ తెలిపారు.
రూ.కోటి 22 లక్షల ఆదాయం
గుంటూరులోని వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించి బంగ్లాదేశ్ కు రైలు ద్వారా మిర్చిని పంపించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ 6 ప్రత్యేక సరకు రవాణా రైళ్లు బంగ్లాదేశ్ కు వెళ్లాయన్నారు. తద్వారా 2 వేల 610 టన్నుల మిర్చి ఎగుమతి అయ్యిందని వివరించారు. ఏప్రిల్-జులై నెలల మధ్య కాలంలో సరకు రవాణాలో వచ్చిన రూ.1.61 కోట్ల ఆదాయంలో... మిర్చి ద్వారానే రూ.1.22 కోట్లు సమకూరిందన్నారు.
బంగ్లాదేశ్ కు రోడ్డు మార్గంలో రవాణా చేయాలంటే దాదాపు వారం రోజులు పడుతుందని, రైల్లో అయితే రెండు రోజుల్లో సరకు అక్కడకు చేర్చవచ్చని డీఆర్ఎం చెప్పారు. మిర్చి రవాణాను మరింతగా పెంచనున్నట్లు వెల్లడించారు. అలాగే పత్తి వ్యాపారులతోనూ మాట్లాడుతున్నామని... త్వరలో పత్తిని కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
వేగంగా పనులు
రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు డీఆర్ఎం తెలిపారు. పేరిచర్ల-సాతులూరు మధ్య డబ్లింగ్ పనులు 24.10 కి.మీ పూర్తయ్యాయన్నారు. కురిచేడు-గజ్జలకొండ, మార్కాపురం-తర్లుపాడు మధ్య 36 కిలోమీటర్ల లైన్ పనులు నిర్మాణదశలో ఉన్నాయన్నారు. న్యూ పిడుగురాళ్ల-శావల్యపురం మధ్య 45 కిలోమీటర్లు పనులు జరిగాయన్నారు.
ఇందుకు సంబంధించి విద్యుదీకరణ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నడికుడి-శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయన్నారు. డివిజన్ పరిధిలో రోజూ 120 వ్యాగన్లు వెళ్తున్నాయని డీఆర్ఎం మోహనరాజ తెలిపారు. వీటిని 140కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: