జలాశయంలో దూకి యువకుడు ఆత్మహత్య..
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయంలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు కొల్లూరి రాంబాబు కుమారుడు దుర్గాప్రసాద్ (29) గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. జలాశయంలో దుర్గాప్రసాద్ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా లక్కవరం ఎస్ఐ కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహన ప్రమాదం..ఇద్దరుమృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డామ్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కలికోట గ్రామానికి చెందిన భాస్కర్ రావు (42), శ్రీను (40) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి...
ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, శ్రీనివాస్ దంపతుల కుమారుడు దినేష్ (02) ఇంటి ముందు ఆడుకుంటూ మూత తెరిచి ఉంచిన నీటి సంపులోకి పడిపోయాడు. తల్లిదండ్రులు లోపల ఉండటంతో బాలుడిని గమనించలేదు. అనంతరం బాలుడి కోసం ఊరంతా వెతికినా జాడ కానరాలేదు. చివరికి అనుమానం వచ్చి సంపును పరిశీలించగా బాలుడు పడి ఉండటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్య సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి : వైఎస్ వివేకాను వాళ్లే చంపించి.. నాపై కేసులు పెట్టారు: ఆదినారాయణరెడ్డి
విద్యుదాఘాతంతో యువకుడు మృతి...
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో నందిగామ డీవీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద నీళ్ల కోసం గుంజీ శివకుమార్(19) మోటార్ స్విచ్ వేయగా అంతకు ముందే మోటార్ కు ఎర్త్ కనెక్టయి ఉండటంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించారు.
మూడు నెలల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు...చెరువులో కనిపించిన అస్థిపంజరం...
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని గోనిమేకలపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు రంగమ్మ(70) మూడు నెలల క్రితం అదృశ్యం అయింది. శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లి చెరువులో అస్థిపంజరాన్ని పశువుల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అస్తిపంజరం పై ఉన్న చీరను గుర్తించిన కుటుంబ సభ్యులు.. తప్పిపోయిన రంగమ్మని గుర్తించారు.. గతంలో చెరువు నిండుగా నీళ్లు ఉండటంతో గుర్తించలేకపోయారు. ప్రస్తుతం చెరువులో నీరు ఇంకి పోవడంతో అస్థిపంజరం బయటపడింది.
2880 గ్రాముల గంజాయి సీజ్..అదుపులో 12 మంది...
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు. ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2880 గ్రాముల గంజాయి ను సీజ్ చేసి., 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
బైక్, బొలెరో ఢీ...ఐదుగురికి గాయాలు...
చిత్తూరు జిల్లా నడింపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని, బొలెరో ఢీ కొట్టి.. పల్టీలు కొట్టి...రహదారి ఆనుకుని ఉన్న కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి స్వల్పగాయాలు కాగా.. మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనంపై వస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి : Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...
హోలీ సంబరాల్లో విషాదం...ఇద్దరు విద్యార్థులు దుర్మరణం..
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో శనివారం జరిగిన హోలీ సంబరాల్లో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. అయ్యపగాని పల్లెలో బాల బాలికలు హోలీ సంబరాల్లో రంగులు చల్లుకున్నారు. అనంతరం సమీప చెరువులో రంగులను శుభ్రం చేసుకొనే ప్రయత్నంలో పట్టు తప్పి నీటిలో మునిగిన అశోక్ (13), సరిత (16) మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
21 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం..ఐదుగురు అరెస్ట్...
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళ్యం మండలాలలోని భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అటవీ అధికారులకు..తలకోన సెంట్రల్ బీట్ లోని మబ్బుకోన వద్ద తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు దాదాపు 30 మంది తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను వదిలేసి దట్టమైన అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించిన అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో లభించిన 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
క్వారీ ప్రమాదంలో కార్మికుడు మృతి..
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో జరిగిన క్వారీ ప్రమాదంలో చింతాడ సంతోష్ కుమార్(33) అనే కార్మికుడు మృతి చెందాడు. పై నుంచి రాయి జారిపడి తలకు తగలటంతో తీవ్ర గాయాలయ్యాయి. సంతోష్‌ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడికి భార్య, 8, 6 వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి : నూజివీడులో కొనసాగుతున్న ఉద్రిక్తత...తెదేపా నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అరెస్ట్
టిఫిన్ కావాలని వచ్చి.. వాచ్‌మెన్‌పై కత్తితో దాడి..
గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్‌పై మిశ్రా దాబా వద్దకు వెళ్లిన నలుగురు వ్యక్తులు టిఫిన్ కావాలని అడిగారు. సర్వీసు నిరాకరించడంతో రెచ్చిపోయిన నలుగురు యువకులు.. హోటల్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై కత్తితో దాడి చేశారు. గాయపడిన వాచ్‌మెన్‌ను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బళ్లారి-బెంగళూరు అంతర్రాష్ట్ర రహదారిలో దోపిడీ..
అనంతపురం జిల్లా డి.హిరేహాల్ సమీపంలోని బళ్లారి - బెంగళూరు అంతర్రాష్ట్ర రహదారిలో దోపిడీ జరిగింది. మారణాయుధాలతో వాహనాన్ని అడ్డుకుని దోపిడీకి తెగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.3.70 లక్షలు దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతలో గొర్రెల కొనుగోలుకు ప్యాపిలి నుంచి కర్ణాటకలోని రాంపురం సంతకు వెళ్తుండగా దోపిడీకి పాల్పడ్డారని వాపోయాడు.
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి..
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి శివారులోని శ్రీనివాస్‌నగర్ వద్ద ట్రాక్టర్‌పై తిరునాళ్లకు వెళ్తూ.. గోవాడ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడు శ్రీకాంత్ (25)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు లారీలు ఢీ... డ్రైవర్‌ను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది..
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని మూలవంక వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్‌ను హైడ్రాలిక్ పరికరంతో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారు..