పెదకాకాని శివాలయంలో మాంసాహారం వండిన ఘటనకు సంబంధించి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు దేవాదాయ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. దేవాదాయ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిప్యూటీ కమిషనర్‌కే వినతిపత్రం అందజేశారు. వైకాపా ప్రభుత్వం హిందూ దేవాలయాలను నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని భాజపా నేతలు ఆరోపించారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లుగా వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాల్లో మాంసాహారం వండించి అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అండదండలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పెదకాకాని శివాలయంలో జరిగిన ఘటనకు కారణమైన వారిని, వారికి వత్తాసు పలికే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.