Bail to senior journalist Ankababu: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు గుంటూరు సీఐడీ కోర్టులో ఊరట లభించింది. గురువారం విజయవాడలో అంకబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ న్యాయవాదుల వాదనలు వినిపించగా.. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. విచారణ సందర్బంగా 41-ఎ నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పడంపై సీఐడీ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీసులిచ్చి.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం అంకబాబుతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.
న్యాయమూర్తి ఎదుట అంకబాబు కీలక విషయాలు వెల్లడించారు. తనపై నమోదు చేసిన కేసు ప్రభుత్వం దురుద్దేశంతో పెట్టిందని ఆరోపించారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబడిన వ్యవహారంపై కొన్ని ఛానళ్లల్లో, పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. వాటిపై కాకుండా తనపైనే కేసు నమోదు చేయటాన్ని ఆయన ప్రశ్నించారు. సిఐడీ చెప్పిన ఆర్థిక నేరాల కేసుల్లో.. 2013లోనే తన పేరుతొలిగించారని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. తాను తెదేపా సానుభూతిపరుడినని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలు సరికాదన్నారు. సీఐడీ అధికారులు తన వాంగ్మూలాన్ని మార్చారని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు.
"అంకబాబుని రిమాండ్ కు తరలించాలని సీఐడి దాఖలు చేసిన రిపోర్టుని న్యాయమూర్తి తిరస్కరించారు. 41ఎ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంకబాబును 25 వేల సొంతపూచీ కత్తుపై విడుదల చేయాలన్నారు". -రాజీవ్ ఆనంద్, న్యాయవాది
పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: చంద్రబాబు.. అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం చేసే చట్ట ఉల్లంఘనలు పోలీసులను బోనులో నుంచో పెడతాయని హెచ్చరించారు. అంకబాబు అరెస్టు వ్యవహారంలో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెయిల్ మంజూరైన తర్వాత అంకబాబుని తెదేపా నేతలు పరామర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్నా తీరును తప్పుబట్టారు.
అరెస్టులతో కట్టడి చేస్తారా: జనసేన అధినేత పవన్.. సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుని అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణిని వెల్లడిస్తుందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఐడీ అధికారులు సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదన్నారు. జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవటం నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వం వైఫల్యాలను.. పాత్రికేయులు ప్రజలకు తెలియజేయడం.. పాలకులకు రుచించడం లేదన్నారు. గౌరవ న్యాయమూర్తులను కించపరచినవారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రభుత్వాన్ని ఉలిక్కి పాటుకు గురిచేసిందంటే వాస్తవాలు దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
బలవంతంగా తీసుకెళ్లారని భార్య ఫిర్యాదు: సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన భర్తను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారంటూ అంకబాబు భార్య విజయ రాత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలకు లేఖ రాశారు. ‘అరెస్టు మెమో ఇవ్వకుండానే నా భర్తను తీసుకెళ్లారు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నా భర్తను వెంటనే విడుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది: Journalist Ankababu in CID custody: సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.
అంకబాబు సతీమణి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించిగా.. తాము సీఐడీ అధికారులమని, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు అంకబాబు వాట్సప్‌లో పోస్టులు ఫార్వర్డ్ చేశారని, వాటిపై ప్రశ్నించేందుకు తీసుకెళ్తున్నామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపించేస్తామంటూ అంకబాబును బలవంతంగా తీసుకెళ్లారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు రావిపాటి సాయికృష్ణ, తెదేపా కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.
ఇవీ చదవండి: