గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఆగ్రిటెక్ ప్రదర్శన (AP Agritech Exhibition at Acharya NG Ranga Agricultural University) జరగనుంది. డిసెంబర్ 17నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శనలో.. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలు, అధునాతన యంత్రాలు, సాగు పరికరాలను రైతులకు పరిచయం చేయనున్నట్లు యూనివర్శిటీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పంటల ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందంజలో ఉందని విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం డైరక్టర్ త్రిమూర్తులు తెలిపారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, పట్టుపరిశ్రమకు సంబంధించి వస్తున్న మార్పులపై చర్చాగోష్ఠులు కూడా నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశ్రమల ప్రతినిధుల్ని, శాస్త్రవేత్తల్ని, నిపుణుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై విశ్వవిద్యాలయం తరపున పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు శాస్త్రవేత్త సాంబయ్య తెలిపారు. తమ పరిశోధనా ఫలితాల్ని అగ్రిటెక్ సదస్సులో రైతులకు వివరిస్తామన్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు డ్రోన్ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో రైతులకు తెలియజేస్తామన్నారు. ఇప్పటికే తమ పరిశోధనా ఫలితాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: MISUSING MPLADS FUNDS IN AP: ఎంపీ లాడ్స్ నిధులపై నివేదిక పంపండి.. ఏపీకి కేంద్రం ఆదేశం