Kakumanu Development By Prasad : ఈయనే కారుమంచి ప్రసాద్. ప్రసాద్ సీడ్స్ వ్యవస్థాపకులు. గుంటూరు జిల్లా కాకుమానులోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఉన్నత చదువులు చదివి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినా కానీ... జన్మభూమిపై మమకారం వదులుకోలేదు. తనలాగే సొంతూరునూ ఉన్నతంగా చూడాలనుకున్నారు. గ్రామంలో ఒక్కో సమస్యనూ తీర్చుతూ వస్తున్నారు. పాతికేళ్ల క్రితమే లక్షల రూపాయలు వెచ్చించి కాకుమాను ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. పెదనందిపాడు, కాకుమాను మండలాల పరిధిలోని 10 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని కోసం తన వంతుగా 7లక్షలు ఇచ్చారు. గ్రామంలోని అన్ని పురాతన ఆలయాలను ఆధునికరించే క్రతువులో భాగస్వామి అయ్యారు.
" మా ఊళ్లో ఎప్పుడో ఆరేడు వందల సంవత్సరాల క్రితం గుళ్లు నిర్మించారు. వాటిలో మేము ఆడుకున్నాం. అవి శిథిలావస్థకు వచ్చాయి. వాటిని ప్రజల అవసరాల కోసం పునరుద్ధరించాం. చర్చిల్లో కూడా మరమ్మతులు చేయించాం. ముస్లిం కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాం. నేను చేసేది మంచిదైనపుడు చేసినంత కాలం ఎలాంటి అడ్డంకులు రావని నా నమ్మకం. " -కారుమంచి ప్రసాద్, వ్యాపారవేత్త
ఊరికి వచ్చినప్పుడల్లా బంధుమిత్రుల ఇంటికి, బడికి, గుడికి వెళ్లటం ఓ నియమంగా పెట్టుకున్నారు ప్రసాద్. ఈ క్రమంలో తాను గుర్తించిన సమస్యల పరిష్కారానికి తనవంతు సాయం చేస్తారు. తనతోపాటు చదువుకున్న మిత్రుడి ఇల్లు వర్షానికి దెబ్బతింటే కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. ఊరి అభివృద్ధి పథంలో ప్రసాద్ ముందుంటారని గ్రామస్థులు చెప్తున్నారు.
ఇదీ చదవండి : Migratory exotic birds Death: ప్రాణాలొదులుతున్న వలస వచ్చిన విదేశీ పక్షులు...కారణం అదేనా ?
ప్రసాద్ ప్రస్తుతం తాను చదువుకున్న బడిని బాగుచేసే బాధ్యత తీసుకున్నారు. కొందరు పూర్వ విద్యార్థులు, స్నేహితులతో కలిసి, 30 లక్షలు వెచ్చించి పాడైన గదులకు మరమ్మతులు చేయించారు. పాఠశాల నూతన భవనాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించారు.
" చదువుకునే కుర్రాళ్లకు ఆర్థిక ఇబ్బందులుంటే ఆయన తప్పకుండా సాయం అందిస్తారు. ఎక్కడ ఉన్నా ఊరిని, ఊరి అవసరాల్ని మరిచిపోలేదు. గ్రామ అవసరాలన్నింటికీ ఆయన ముందుంటారు. " - గ్రామస్థుడు.
" గ్రామంలో వాటర్ ఫ్లాంట్ కట్టించింది ఆయనే. గ్రామంలో ఉన్న ప్రతీ సౌకర్యం వెనుక ఆయన ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సాయం లేకుండా గ్రామంలో ఏమీ అవ్వలేదు . " - గ్రామస్థుడు.
రైతు కుటుంబం నుంచి ఎదిగిన కారుమంచి ప్రసాద్, 1982లో జనుము విత్తనాలతో వ్యాపారం మొదలు పెట్టారు. 1998లో బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం ద్వారా వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం భారత్‌లోనేకాక.. మరో 6 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : Illegal Affair Killed Son: ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..!