అంతుచిక్కని అస్వస్థతతో.... ఏలూరు ప్రజలు రెండో రోజూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శనివారం ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణవీధి వాసులు ముందుగా అనారోగ్యం పాలయ్యారు. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించగా... బాధితుల సంఖ్య ఎక్కువైంది. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నుంచి నురగ రావడం, కళ్లు తిరిగిపడిపోవడం వంటి లక్షణాలతో.... చిన్నా, పెద్దా అందరూ ఆసుపత్రుల్లో చేరారు. వయసుతో పాటు ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆరుగురిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులందరికీ అన్ని పరీక్షలు నిర్వహించినా... ఎక్కడా వ్యాధికి కారణాలు తెలియలేదు. బాధితుల్లో ఎక్కువ మంది... 20 నుంచి 30 ఏళ్ల వారు కాగా.... 12 ఏళ్లలోపు పిల్లలు.... 40 మందికి పైగా ఉన్నారు. అప్పటివరకూ బాగానే ఉన్నామని.... ఏం జరిగిందో తెలిసేలోపే కింద పడిపోయామని బాధితులు అంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని.... అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
పరిశీలనకు నిపుణుల బృందం
బాధితులు అందరూ క్రమంగా కోలుకుంటున్నారన్న మంత్రి ఆళ్లనాని....ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు కారణాలు తెలియలేదని, తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా.... ఎలాంటి కలుషితాలు బయటపడలేదన్నారు. పూర్తిస్థాయి పరిశీలనకు హైదరాబాద్ నుంచి నిపుణుల బృందం.... సోమవారం ఉదయానికి వస్తుందన్నారు.
ఏలూరు ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నర్ కార్యాలయంతో కేంద్ర హోంశాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. గవర్నర్ నుంచి నివేదిక వచ్చాక... సహాయకచర్యలపై స్పందించే అవకాశముంది.
ఇదీ చదవండి: