చిత్తూరు జిల్లా…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా పూతలపట్టులో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిన మహానేత, కారణజన్ముడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలు జగన్ రూపంలో పదిలంగా ఉన్నాయని, ఆయన ఆశయ సాధనకు వడివడిగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా..
తణుకులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, పేద బడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడుతూ అంజలి ఘటించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు కోరారు.
కర్నూలు జిల్లా…
వైఎస్. రాజశేఖరరెడ్డి వర్థంతి ని కర్నూలులో వైకాపా నాయకులు నిర్వహించారు. నగరంలోని వైఎస్సార్ కూడలిలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ అభిమానులు, వైకాపా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా …
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నరసన్నపేటలో వైయస్సార్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. మారుతి నగర్ కూడలి వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి 11వ వర్ధంతి పురస్కరించుకొని శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు.
తూర్పు గోదావరి జిల్లా….
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కొత్తపేట నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరుస, కొత్తపేట మండలాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంపచోడవరం మన్యంలో వాడవాడలా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయం వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి వైయస్సార్ చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు.
కృష్ణా జిల్లా…
మైలవరంలోని వైకాపా పార్టీ కార్యాలయంలో మూడు బొమ్మల సెంటర్ లో లక్కీరెడ్డి కాంప్లెక్స్ వద్ద మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. పేదలకు అన్నదానం చేశారు.
విశాఖ జిల్లా…
చీడికాడ మండలం తురువోలులో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించి ప్రజల గుండెల్లో రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ పాలన సాగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనంతరం పేదలకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. వెంకన్నపాలెం, విజయరామరాజుపేటలలో పేదలకు కూరగాయలు అందజేశారు. నర్సీపట్నం తో పాటు పలు ప్రాంతాల్లో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనకాపల్లి పట్టణం, అనకాపల్లి, కశింకోట మండల ప్రాంతాల్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో 19,600 వేల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. తాళ్లపాలెంలో 108 కార్యాలయాన్ని ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా…
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా యర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానసిక వికలాంగులకు పాలు, బ్రెడ్ లు, పండ్లు పంపిణీ చేశారు. చీరాలలో గడియార స్తంభం కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఫులమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.3 లక్షల 40 వేల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ... పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్టంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు.
విజయనగరం జిల్లా..
చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ ఆవరణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ పథకాలన్నింటికీ నిధులు మంజూరు చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే కొనియాడారు. విజయనగరం పట్టణంలో వై.ఎస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహర్ వై.ఎస్.ఆర్ అంటూ నినాదాలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం చేసిన సేవలను మరువలేమని కొనియాడారు. ఆయన ప్రజల కోసం 108, ఆరోగ్య శ్రీ వంటి అనేక పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా…
రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కదిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అనంతరం కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని కొవిడ్ పాజిటివ్ బాధితులతో పాటు సాధారణ రోగులకు బ్రెడ్ లు పంపిణీ చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
కృష్ణా జిల్లా…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాలలో వైకాపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నున్న, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు తదితర గ్రామాల్లో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పేద వర్గాల ఆశాజ్యోతి వైయస్సార్ అంటూ కొనియాడారు. వైయస్సార్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు పడుతున్నారన్నారు.
గుంటూరు జిల్లా…
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా రేపల్లె నియోజకవర్గంలో పలు చోట్ల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాంపట్నం మండలంలో 69 మంది డప్పు కళాకారులకు డప్పులు మోపిదేవి పంపిణీ చేశారు. స్త్రీ శక్తి భవనంలో మత్స్యకార మహిళలు జీవనోపాధి కోసం కూల్ బాక్స్ లను అందజేసారు. తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని మోపిదేవి కొనియాడారు.
తాడికొండ, మేడికొండూరు, పిరంగిపురం మండలంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దుప్పట్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. పలు చోట్ల అన్నదానం నిర్వహించారు.
ఇవీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు