కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతివ్వాలన్న వైకాపా నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు, వ్యూహాత్మక అవసరాలు ఉన్నాయి. రాష్ట్రంలో వైకాపాకు ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్నా.. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలన్న లక్ష్యంతోనే. బిల్లుకు... వైకాపా మద్దతు ఇస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏ బిల్లునూ వ్యతిరేకించని వైకాపా..
ఇంతవరకూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బిల్లునూ వైకాపా వ్యతిరేకించలేదు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ముందు... రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో వైకాపా సన్నిహితంగా ఉంటూనే వస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైకాపా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా... పాలన నల్లేరుమీద నడకలా లేదు. రాష్ట్రానికి ఆర్థిక వనరుల కొరత, ఇతరత్రా సమస్యలు ఇబ్బందికరంగా పరిణమించాయి. కేంద్రంలోని పెద్దల ఆశీస్సులుంటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చొన్న భావన వైకాపా నాయకత్వంలో ఉంది. పాలన గాడిన పడాలంటే కేంద్రం నుంచి చేయూత అవసరం. అందుకే రాష్ట్రంలోని భాజపా నాయకులు వైకాపా సర్కారుపై పదునైన విమర్శలే చేస్తున్నా.. వైకాపా నుంచి పెద్దగా ఎదురు దాడి లేదు. పైగా కేంద్రంలో భాజపా నేతలతో సన్నిహితంగా మెలిగేందుకు, సత్సంబంధాలు కొనసాగించేందుకు ఏ అవకాశాన్ని వైకాపా విడిచిపెట్టడం లేదు.
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతివ్వడమూ దానిలో భాగమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీ అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి.
ఇదీ చదవండి : పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మోదీ హర్షం