నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సమర్పించిన విజ్ఞాపన పరిష్కారంలో అన్యాయమైన ఆలస్యం జరుగుతోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘2020 జులై 3న రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైకాపా పార్లమెంటరీ పక్షం తరఫున ఫిర్యాదు చేశాం. తర్వాత అనేక సార్లు చర్యలు తీసుకోవాలని వైకాపా సభ్యులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని మీరూ అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా ఈ నెల 11న వైకాపా చీఫ్ విప్, 17న వైకాపా లోక్‌సభాపక్ష నేత మిమ్మల్ని కలిసి మళ్లీ ఫిర్యాదు చేశారు. మా మొదటి విజ్ఞాపన సమర్పించిన 11 నెలల తర్వాత దాన్ని మరో విధానంలో ఇవ్వాలంటూ మీ కార్యాలయం నుంచి మాకు సమాచారం వచ్చింది. ఫిర్యాదులో ఏవైనా లోపాలుంటే ఆ విషయాన్ని రెండు పార్లమెంటు సెషన్ల తర్వాత కాకుండా ముందుగానే సమాచారం ఇచ్చి ఉండవచ్చు. ఏదేమైనా మీ కార్యాలయం సూచించినట్లుగానే ఆ ఫిర్యాదును సమర్పిస్తాం. రఘురామకృష్ణ రాజుపై అనర్హత ఫిర్యాదు పరిష్కారంలో జాప్యం వల్ల నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఒక అర్హత లేని వ్యక్తి ఆ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనర్హత పిటిషన్‌పై ఆలస్యమనేది కె.మేఘా చంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ శాసనసభ సభాపతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకం...’అని విజయసాయి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి