ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాజధాని అమరావతి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు... పార్టీ పంపితే రైతుల వద్దకు వచ్చారా? లేదంటే వ్యక్తిగతంగా వచ్చారా? అనేది ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల క్రితం మహిళా రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తే ఎంపీ అప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
పోలీసుల తీరు సరికాదు
'రాజధాని ప్రాంతంలో సొంత ఊరు ఉన్న మోదుగుల, స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని గ్రామాలకు రాలేదు. అలాంటిది మీరెందుకు వచ్చారో తెలపాలి' అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే.... పోలీసులు చోద్యం చూడటం దారుణమన్నారు. అధినేత మాటకు కట్టుబడి తెదేపా నేతలు సంయమనం పాటిస్తున్నారన్నారు.