YARLAGADDA ON TELUGU అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్, అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. ఆంగ్ల మాధ్యమ విద్యా సంస్థల్లో తెలుగు భాషను పాఠ్యాంశంగా బోధించాలని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు ప్రభుత్వం విశేష అధికారాలు కల్పించిందని, సెప్టెంబరు రెండో వారం నుంచి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘అధికార యంత్రాంగం తెలుగు భాషను అమలు చేయకపోతే పత్రికలు, ప్రసార మాధ్యమాలు వెలుగులోకి తీసుకురావాలి. ఇంటర్మీడియట్ వరకు తెలుగును మొదటి భాషగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం. డిగ్రీ స్థాయిలోని అన్ని సెమిస్టర్లలో ఒక పాఠ్యాంశంగా బోధించేటట్లు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 29న విశాఖపట్నంలో నిర్వహిస్తాం. తెలుగు భాష కోసం ఉద్యమాలు చేసిన, పరిరక్షణకు కృషి చేసిన 40మందికి సత్కారం, ప్రశంసాపత్రంతోపాటు రూ.15వేల చొప్పున నగదు పురస్కారం అందిస్తాం’’ అని వివరించారు.
ఇవీ చదవండి: