ఫలానా వ్యక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే... అతని చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా పోలీసులు అతన్ని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయమని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా హామీ తీసుకుని సొంతపూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. ఇలా అయిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ రూ.2లక్షలు ప్రభుత్వ ఖాతాకు జప్తు చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం 106, 107, 108, 110 సెక్షన్ల కింద రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవవచ్చు. గుంపుగా వెళ్లి మరో గుంపుపై గొడవ పడటం, సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారు.
రౌడీషీట్ ఎందుకు తెరుస్తారు?
ఒక వ్యక్తి నేరం చేయడం, అతి భయంకరంగా హత్య చేయడం, భౌతిక నేరాలకు పాల్పడటం, తరచూ నేరం చేయాలనే ఉద్దేశం కలిగి ఉండటం, ప్రజల్లో అశాంతిని రేకెత్తించటం, సమాజాన్ని సమస్యల్లోకి నెట్టేందుకు ప్రయత్నించటం వంటి చర్యలకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌కు పాల్పడినా, పోలింగ్ సామగ్రిని ఎత్తుకెళ్లినా, ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినా, ఎన్నికల అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడినా రౌడీషీట్ తెరుస్తారు. ఒక వ్యక్తి నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడని తెలిస్తే అతనిపై నిత్యం నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌వో భావిస్తే రౌడీషీట్ తెరవాలని సంబంధిత సీఐకి ప్రతిపాదనలు పంపుతారు. సీఐ వాటిని పరిశీలించి డీఎస్పీకి సిఫార్సు చేస్తారు. ఆయన మరోసారి పరిశీలించి రౌడీషీట్ తెరిచేందుకు అనుమతి జారీ చేస్తారు.
కేసులు నమోదైతే కఠిన శిక్షలు..
ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే శిక్షలు కఠినంగా, తీవ్రంగా ఉంటాయి. కేసులపై ఎన్నికల సంఘం ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. శిక్షలు పడేలా దర్యాప్తు సాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతపై ఒక్కసారి నమోదైతే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇదీచదవండి:ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!