73ఏళ్ల థామస్ కప్ చరిత్రలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత షట్లర్లకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. తుది పోరులో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా కప్ గెలవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇండోనేషియాను భారత షట్లర్లు సమష్టి కృషితో ఓడించారని సీఎం జగన్ కొనియాడారు. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మెరుగైన ఆటతీరు కనబరిచారని కొనియాడారు.
భారత జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. థామస్‌కప్‌లో భారత విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని బ్యాడ్మింటన్ జట్టు సలహాదారు పున్నయ్య చౌదరి అన్నారు. ఈ విజయం వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు గెలవడానికి ఉపయోగపడుతుందని అబిప్రాయపడ్డారు.
ఈ చారిత్రాత్మక విజయంలో తమ కుమారుడు భాగం కావడం తమకు గర్వకారణమని కిదాంబి శ్రీకాంత్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 2017లో మాదిరిగా శ్రీకాంత్ అటాకింగ్ గేమ్ ఆడారని గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సమష్టి విజయమంటూ మిగిలిన ఆటగాళ్లనూ ప్రశంసించారు. థామస్ కప్‌లో బంగారు పతక విజయం సామాన్యమైన విషయం కాదని సాయిరాజ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి థామస్‌కప్ విజేతగా..