వ్యాక్సినేషన్ పూర్తిచేస్తేనే కొవిడ్‌ను పూర్తిగా నివారించవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దేశానికి 172 కోట్ల డోసులు కావాల్సి ఉందన్న సీఎం.. ఇప్పటివరకు కేవలం 18 కోట్ల వాక్సిన్లే ఇవ్వగలిగారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 7 కోట్ల డోసులు కావాల్సి ఉందని.. ఇప్పటివరకు 73 లక్షల డోసులు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయని.. భారత్ బయోటెక్ నెలకు కోటి వ్యాక్సిన్లు తయారుచేస్తోందని అన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు నెలకు 6 కోట్ల వాక్సిన్ల తయారీ సామర్థ్యం ఉందని తెలిపారు.
దేశంలో కేవలం నెలకు 7 కోట్ల వాక్సిన్ల తయారీ సామర్థ్యం ఉందన్న జగన్.. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మాస్కులు, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు. నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే కొవిడ్‌పై యుద్ధం చేయాలని అన్నారు.
ఇదీ చదవండి: పెద్దాపురం ఏడీబీ రహదారిపై ప్రమాదం.. నలుగురు మృతి