పట్టణీకరణ, నగరాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా.. మారుమూల పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. అనారోగ్యం బారిన పడిన వారిని ఆస్పత్రికి తరలించాలన్నా.. ఆస్పత్రిలో మరణించిన వారిని స్వగ్రామాలకు తరలించాలన్నా రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వెళ్లే దారిలో వాగులు, వంకలు ప్రవహిస్తే ఈదుకుంటూ వెళ్లాల్సిందే.. లేదంటే ఏ డోలినో నమ్ముకోవాల్సిందే. ఈ క్రమంలో భారీ వర్షాలు పడితే వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవాహాన్ని దాటాల్సిందే. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు గ్రామస్థులు ఎదుర్కొన్న ఇబ్బందులే ఇందుకు నిదర్శనం.
ఆళ్లపల్లి మండలం బొడాయికుంట గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి కొన్ని రోజుల క్రితం మలేరియా సోకింది. దీంతో కుటుంబీకులు ఆయనను కొత్తగూడెం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు శనివారం మరణించారు. మృతదేహాన్ని తీసుకువచ్చిన 108 వాహనం.. మర్కోడు వరకు చేరింది. కానీ బొడాయికుంట, నడిమిగూడెం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న చింతపడివాగు కారణంగా అంబులెన్స్ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. మృతదేహాన్ని ఇక్కడ వరకే తేగలమని 108 సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమీ లేక డోలి కట్టుకుని మృతదేహాన్ని గ్రామానికి కుటుంబీకులు తీసుకెళ్లారు.
డ్రోన్ల సహాయంతో వైద్యానికి అవసరమైన మందులను అత్యవసర సమయంలో.. మారుమూల పల్లెలకు తరలిస్తున్న ప్రభుత్వం.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు వైద్యం కోసం పడుతున్న కష్టాలపై కూడా స్పందించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు మంజూరైనా.. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు రావాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇదీ చదవండి: SUICIDE: అక్కతో పెళ్లి..మరదలితో ప్రేమ..చివరికి..!