Village secretariats Construction: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (నరేగా) మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 10,941 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలను రూ.4,376 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటిలో గత రెండేళ్లలో 5,400 భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. వాస్తవంగా ఈపాటికే అన్ని చోట్లా పనులు పూర్తి చేసి భవనాలను ప్రారంభించాలి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కావడంతో పలుచోట్ల పనులను గుత్తేదారులు అసంపూర్తిగా నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1,370.15 కోట్లు విడుదల చేయడంతో పెండింగ్ బిల్లులు కొన్ని చెల్లించామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన పనులను పూర్తి చేయించాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాలు, వైద్యశాలలు, పాల శీతలీకరణ కేంద్ర భవనాలకు సంబంధించి దాదాపు రూ.278 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
![Village secretariats Construction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16043766_office1.jpg)
పంచాయతీలకు సంబంధం లేదంటూనే: సచివాలయాలకు గ్రామ పంచాయతీలతో సంబంధం లేదని ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే... ఇంకోవైపు అదే పంచాయతీ భవనాల్లో సచివాలయాల కార్యకలాపాలను కొనసాగించడంపై పలువురు సర్పంచులు అభ్యంతరం చెబుతున్నారు. ఒకే భవనంలో ఇటు పంచాయతీ, అటు సచివాలయాల కార్యకలాపాల నిర్వహణతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం పెదభోగిలి పంచాయతీ భవనంలోనే రెండు సచివాలయాల కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ సర్పంచి, వార్డు సభ్యులను ఒక చిన్న గదికి పరిమితం చేశారు.
![Village secretariats Construction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16043766_office2.jpg)
ఇవీ చదవండి: