ఉల్లి, నిత్యావసరాల ధరలు, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. శ్రీకాకుళంలో రైతుబజార్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ వామపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. విశాఖ మద్దిలపాలెం జాతీయ రహదారిపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాజమహేంద్రవరం వై కూడలిలో వామపక్షాలు నిరసనకు దిగాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నరేంద్ర కూడలిలో ధర్నా చేశారు. పెరిగిన ధరలు పేదవారి పాలిట శాపంగా మారాయన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ రైతుబజార్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఉల్లి ధరను తగ్గించటంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో నిరసన చేపట్టిన వామపక్ష నేతలు... కేవలం 6 నెలల వ్యవధిలోనే సీఎం అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
గుంటూరులో శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకూ వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. ఉల్లి సమస్యను వినూత్నంగా తెలియజేశారు. రోడ్డుపై కుస్తీ పోటీలు నిర్వహించి, గెలిచిన వారికి ఉల్లిట్రోఫీని అందచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం వల్లే ఉల్లి కొరత ఏర్పడిందని... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు.
ఉల్లి ధరల మంట, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై... కడప, కర్నూలు, తిరుపతి, అనంతపురంలోనూ వామపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ఇవీ చదవండి..