తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(21) వ్యాక్సిన్ వేయించుకునేందుకు గురువారం పెద్దఅంబర్‌పేట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ ఆ యువతికి ఒక డోసు వ్యాక్సిన్ వేసింది. తనకు టీకా పూర్తైందని తెలియక యువతి అలాగే కూర్చుండిపోయింది. అదే సమయంలో నర్సుకు ఫోన్ రావడంతో.. ఫోన్‌లో సంభాషిస్తూ యువతికి రెండోడోసు(DOUBLE DOSE VACCINATION) ఇచ్చేసింది.
దీంతో.. యువతి ఆందోళనకు గురై కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో టేబుల్‌పై పడుకోబెట్టి కొబ్బరినీళ్లు తాగించి సెలైన్ ఎక్కించారు. టీకా రియాక్షన్ కాకుండా మరో ఇంజెక్షన్ ఇచ్చి అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచి పరిశీలించారు. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో శనివారం ఉదయం ఆమెను ఇంటికి పంపారు.
గురువారం ఉదయం 8.30 గంటలకు టీకా తీసుకునేందుకు పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లా. 11 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ నాకు టీకా వేశారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూనే అక్కడే కూర్చోవాల్సిందిగా ఆమె సూచించింది. ఏమైనా చెబుతుందేమోననే ఉద్దేశంతో అక్కడే కూర్చున్నా. సెల్‌లో మాట్లాడుతూనే ఆ నర్సు మరో దఫా టీకా ఇచ్చేసింది.- లక్ష్మీప్రసన్న, బాధిత యువతి
మరోవైపు యువతికి రెండు డోసులు ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సిరంజిలోకి మందు లోడ్ చేసిన సమయంలో నర్సుకు ఫోన్ వచ్చిందని.. అప్పటికి ఆమె టీకా వేయలేదని తెలిపారు. ఫోన్ మాట్లాడాక ఒక్కసారే వ్యాక్సిన్ వేశారని అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని అదనపు డీఎంహెచ్‌వోను ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: