తెలంగాణ రాష్ట్రం యాదాద్రి కొండపైన ఆలయం చెంత ఉన్న విష్ణు పుష్కరిణిలో గతంలో భక్తులు పుణ్యస్నానాలాచరించి మొక్కులు చెల్లించేవారు. ప్రదక్షిణ మొక్కు తీర్చుకునే భక్తులూ ఇక్కడే స్నానాలు చేసేవారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా దీన్ని పునరుద్ధరిస్తున్నారు. విస్తీర్ణం కుదించి, లక్ష్మీనారసింహుడి ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు తెలంగాణలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు తెలిపారు. ఈ పనులకు రూ.2.5 కోట్లు వెచ్చిస్తున్నారు.
కృష్ణశిలతో పుష్కరిణి మధ్య మండపం నిర్మించారు. అందులో శ్రీస్వామి ఉత్సవసేవ పర్వాలు చేపడతారు. ఈ వేడుకలను భక్తులు తిలకించేందుకు, మండపం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు నిర్మాణాలు చేపట్టారు. స్లాబ్‌పై ప్లాట్ ఫారాలు, పైకి వెళ్లేందుకు మెట్లు కట్టారు. ఈ కట్టడాల కిందే పుష్కరిణి పుణ్యజలం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ పుణ్యజలాన్ని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచే ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
కొండ కింద ప్రత్యేక కొలను
క్షేత్ర సందర్శనకు వచ్చే తీర్థజనుల పుణ్యస్నానాల కోసం కొండ కింద గండిచెర్ల ప్రాంగణంలో ప్రత్యేక కొలను(గుండం) నిర్మాణానికి పనులు చేపట్టారు. తలనీలాలు సమర్పించే భక్తజనులు ఈ గుండంలోనే పుణ్యస్నానాలు చేసేందుకు అనుగుణంగా వసతులు కల్పించనున్నారు. ఇందులోనే శ్రీస్వామి తెప్పోత్సవం జరపాలనే తెలంగాణ సీఎం సలహా మేరకు భక్తులు కూర్చుని తిలకించేందుకు చుట్టూ బండ్(కట్ట) నిర్మాణానికి యాడా ప్రణాళిక రూపొందించింది.
ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!