Tsrtc: దూరప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే చేతిలో సరిపడా డబ్బు లేకపోయినా, చిల్లర లేకపోయినా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. కానీ, తెలంగాణలో ఇప్పుడా పరిస్థితులు పోయే సమయం వచ్చింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నగదురహిత సదుపాయంతో టికెట్ కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. ఇంటిలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్.. ఐ-టిమ్ అనే మిషన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్టులతో స్వైపింగ్, క్యూ ఆర్ కోడ్‌తో యూపీఐ ద్వారా బస్సు టికెట్లు కొనేయచ్చు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో నగదురహిత ప్రయాణాలు జరుగుతుండగా.. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రీజియన్‌లో ఈ సేవలు అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 928 ఐ -టిమ్ములను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసింది. కరీంనగర్‌లో పది డిపోలకు కలిపి 73 ఐ-టిమ్ములు అందించనుంది.
గరుడ, గరుడ ప్లస్, రాజధాని, హైటెక్, సూపర్‌లగ్జరీ బస్సు సర్వీస్‌లో క్యాష్‌లెస్ సేవలు అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు.. జగిత్యాల, కోరుట్ల నుంచి శంషాబాద్ విమానశ్రయానికి వెళ్లే బస్సు సర్వీసుల్లో నగదు రహిత టికెట్లు ఇస్తున్నారు. ఈ విధానం అమల్లోకి తీసుకు రావడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తప్పాయని డ్రైవర్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్ సదుపాయం ఉంటేనే ఐ-టిమ్ములు వినియోగించేందుకు వీలుంటుంది. ఎక్కడైన సిగ్నల్స్ రాకపోతే ఆ సమస్యను అధిగమించేందుకు ఐ- టిమ్ముల్లో రెండు సిమ్‌కార్టులు సమకూరుస్తున్నారు. ఒక దాంట్లో నెట్‌వర్క్ లేకపోయిన ఇంకోదాంట్లో ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సదుపాయం వల్ల డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, సీట్ల నంబర్‌తో సహా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఈ నూతన సాంకేతికత వల్ల చాలా వరకు ఇబ్బందులు తప్పాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ రీజియన్‌లో కొన్ని డిపోల్లో ఈ నగదు రహిత సేవలు అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
"ఐ-టిమ్ముల వల్ల చిల్లర ఇబ్బందులు తగ్గాయి, ప్రయాణికులు డెబిట్, క్రెడిట్ కార్టులు క్యూ ఆర్ కోడ్‌తో యూపీఐ ద్వారా బస్సు టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా సమయం ఆదా అవుతుంది." -శంకర్, ఆర్టీసీ డ్రైవర్
"క్యాష్‌లెస్ సిస్టమ్ చాలా బాగుంది. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ నూతన సాంకేతికత వల్ల చాలా వరకు ఇబ్బందులు తప్పాయి. ఇప్పుడు ఈ సేవల ద్వారా టిక్కెట్ తీసుకోవడం సులువుగా మారింది." -ప్రయాణికులు
ఇవీ చదవండి: