రాష్ట్రంలో సోమవారం నుంచి మూడో దశ కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం టీకా కోసం ఆదివారం రాత్రి వరకూ కొవిన్ యాప్‌లో పేర్ల నమోదుకు అవకాశం కల్పించలేదు. దీంతో ఈ ప్రక్రియా సోమవారమే ఆరంభం కానుంది. ఫలితంగా మూడో దశ టీకా పంపిణీ కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నవారికి నిర్దేశిత సమయాన్ని (స్లాట్) కేటాయించి టీకా వేయాలి. ముందస్తుగా స్లాట్ పొందినవారి సంఖ్య తక్కువగా ఉంటే నేరుగా వచ్చేవారికీ అవకాశమిస్తారు. పుట్టినతేదీ ఉండే కార్డు, దీర్ఘకాలిక వ్యాధులున్నట్లు వైద్యులిచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించి టీకా పొందవచ్చు. మూడో దశలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులున్న 45- 59 సంవత్సరాల వయసు వారికీ టీకా ఇవ్వనున్నారు. మరోవైపు ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు పంపిణీ జరుగుతోంది.
బుధవారానికి అన్ని ఆసుపత్రుల్లో..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుబంధంగా 564 ఆసుపత్రులున్నాయి. వీటిలో సోమవారం జిల్లాకు కనీసం 5, 6 ఆసుపత్రుల్లో టీకా వేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోగా మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లాలో మొత్తం 7 ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ జరగనుంది. విజయవాడలో 5, మచిలీపట్నం, గుడివాడల్లో ఒక్కో ఆసుపత్రిలో టీకా ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై అక్రమార్కుల రాజ్యం...ఏటా రూ.కోట్లలో ఆదాయానికి గండి