రాష్ట్రంలో జిల్లాలవారీగా ఎన్నికల ట్రైబ్యునళ్లను ప్రకటించడంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చినా... కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల ఏర్పాటు చేయలేదని ఆక్షేపించింది. హోం, శాసన వ్యవహారాలశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. రెండు వారాల్లో ట్రైబ్యునళ్లను నోటిఫై చేస్తామన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఆగస్టు 30న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. చిత్తూరు జిల్లాలో ట్రైబ్యునల్‌ను ప్రకటించకపోవడాన్ని సవాలు చేస్తూ ఎన్.ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయమూర్తి.. ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సీజే ధర్మాసనం ఆదేశాలిచ్చాక జూన్ 21న హైకోర్టు నుంచి పరిపాలనాపరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయన్నారు. ట్రైబ్యునళ్లను నోటిఫై చేసే దస్త్రం సర్క్యులేషన్లో ఉందన్నారు. ప్రతిపాదనలు వచ్చి నెల రోజులైనా పురోగతి లేకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి విషయాల్లో జాప్యం తగదన్నారు. రెండు వారాల్లో ట్రైబ్యునళ్లను నోటిఫై చేస్తామని జీపీ చెప్పడంతో విచారణను వాయిదా వేశారు.
ఇవి చదవండి :