Govt employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న మూడు డీఏల మంజూరుకు ప్రభుత్వం సమ్మతి తెలిపింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు అనుమతించినట్లు మంగళవారం ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలనెలా రూ.260 కోట్ల అదనపు భారం పడుతుంది.
డీఏలపై మంత్రిమండలి నిర్ణయం
పెరిగిన డీఏను ఫిబ్రవరి వేతనం/ఫించనుతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు తాజాగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నాటి డీఏ 3.64 శాతం, అదే సంవత్సరం జూలై నాటి 2.73 శాతం, 2021 జనవరి నాటి 3.64 శాతం- మొత్తంగా 10.01 శాతాన్ని వేతనంతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదిగాక గత జులై (2021) నాటికి చెల్లించాల్సిన 2.73 శాతం డీఏ పెండింగులో ఉంది. ఈ నెల పూర్తయ్యే నాటికి మరో డీఏను ప్రభుత్వం మంజూరు చేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పెండింగు డీఏల మంజూరుపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, టీఎన్జీవో, పీఆర్‌టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, మామిళ్ల రాజేందర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, సత్యనారాయణ, రాయకంటి ప్రతాప్, బీరెళ్లి కమలాకర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ పద్మాచారి, అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్త రమేశ్, గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌గౌడ్, హన్మంతునాయక్, ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ఛైర్మన్ కె.లక్ష్మయ్య, విశ్రాంత టీజీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్‌నారాయణ, నర్సరాజు, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సంపత్‌కుమారస్వామి తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: