అమరావతిలో నిర్మాణాలను ఆపడం సరికాదని జనసేన, సీపీఐ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు అభిప్రాయపడ్డాయి. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయా పార్టీల నేతలు హాజరై... అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంలో అక్రమం జరిగిందని వైకాపా చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
వికేంద్రీకరణకు సుముఖమే
రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజధానిని శ్మశానంతో పోల్చడం బాధాకరమన్నారు. రాజధాని భూముల్లో అవినీతి జరిగితే నిరూపించి శిక్షించాలని కోరారు. అమరావతిపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతపై దాడి జరగడం సరికాదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కూడా సుముఖమేమనని స్పష్టం చేశారు. రాజధానితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి విషయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రాంతీయ ఉద్యమాలకు అవకాశం ఉండేలా మంత్రులు మాట్లాడొద్దని హితవుపలికారు.
దేవాలయాన్ని శ్మశానం అన్నారు
రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టొద్దని జనసేన తరఫున రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బొల్లిశెట్టి సత్యనారాయణ అన్నారు. రాజు మారితే రాజధాని మార్చొద్దని వ్యాఖ్యానించారు. దేవాలయాన్ని పట్టుకొని శ్మశానం అనటం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు లాంటి సీనియర్ల మాటవింటే తప్పేం కాదని ప్రభుత్వానికి సూచించారు.
గందరగోళం స్పష్టించకండి
అమరావతిపై మంత్రుల తీరు సరికాదని లోక్సత్తా పార్టీ తరఫున హాజరైన బాబ్జీ పేర్కొన్నారు. మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దని అన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం