అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లికి చెందిన హరిప్రసాద్ పొలికి గ్రామంలో గతేడాది ఎకరా రూ.30వేల చొప్పున తీసుకుని మిరప వేశారు. ఈ ఏడాది అదే భూమి కౌలు రూ.40వేలు అయింది. పంట బాగా రావడం, డబ్బీ బాడుగ ధరలు బాగుండటంతో పోటీ పెరిగిందని రైతు వివరించారు.
సాగులో కౌలు భారం ఏటికేడు పెరుగుతోంది. మిరప, పసుపు సాగు చేయాలంటే.. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.45వేల వరకు కౌలు రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పత్తి, సెనగ పంటలకూ రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఉంది. ఒకేడాది పంట పండితే రెండో ఏడాది తోటి రైతులంతా అవే పంటల సాగుకు మొగ్గు చూపుతుండటంతో కౌలు ధరలు పెరుగుతున్నాయి. పొలంలోనే బోర్లు, బావులు, కాలువ నీటి సౌకర్యం ఉన్నచోట పోటీపడి ఎక్కువ చెల్లిస్తున్నారు. దీంతో కౌలు ధరలు కొందరికి తలకు మించిన భారంగా పరిణమిస్తోంది.
మిరప సాగుకు ఎకరాకు రూ.30వేల పైనే..
వెనకబడిన ప్రకాశం, దుర్భిక్ష ప్రాంతంగా పరిగణించే అనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో మిరప సాగుకు ఎకరాకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు కౌలు ధర ఉంది. ఎకరాకు రూ.1.70 లక్షల పెట్టుబడి అయితే.. అందులో కౌలు వాటా సగటున 20 నుంచి 25% ఉంటోంది. ప్రకాశం జిల్లా కొమ్మమూరు కాల్వ, గుండ్లకమ్మ పరిధి గ్రామాల్లో మిరప వేసే పొలాలకు గరిష్ఠంగా రూ.35వేల నుంచి రూ.50వేల వరకు ఉంది. అనంతపురం జిల్లా హెచ్‌ఎల్‌సీలో భాగమైన గుంతకల్లు బ్రాంచి కాలువ పరిధిలో సాగునీటి వసతి ఉన్న భూములకు ఎకరా రూ.40వేల నుంచి రూ.42 వేల మధ్యకు చేరాయి.
వరి దిగుబడిలో 43 శాతం కౌలుకే
గోదావరి డెల్టా పరిధిలో గతంలో ఎకరాకు సగటున 26 బస్తాల వరకు ఉండగా.. ఈ ఏడాది 30 బస్తాలకు పెరిగింది. దిగుబడిలో 43 శాతం కౌలుకే సరిపోతోంది. తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో 90 శాతం కౌలు రైతులే. ఇక్కడ ఎకరాకు గరిష్ఠంగా 32 బస్తాల వరకు కౌలుగా చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ‘గతేడాది ఎకరాకు 25 బస్తాల చొప్పున మూడెకరాలు కౌలుకు తీసుకున్నా.. ఈ ఏడాది 30 బస్తాలకు పెరిగింది’ అని ఆలమూరుకు చెందిన గుత్తుల సుబ్రమణ్యం పేర్కొన్నారు.
పసుపులో కాస్త తగ్గినా..
పసుపు సాగులో మూడేళ్లగా నష్టాలొస్తున్నా.. గుంటూరు జిల్లాలో ఎకరాకు గరిష్ఠంగా రూ.40వేల నుంచి రూ.45వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. క్వింటా ధర రూ.8వేల పైన పలికిన రోజుల్లో రూ.50వేల నుంచి రూ.60వేల మధ్యన ఉండేది. మొత్తం పెట్టుబడిలో 24% కౌలుకే కేటాయించాల్సిన పరిస్థితి.
పత్తి, సెనగకూ అధికమే..
పత్తి, సెనగ వేసే పొలాలకూ కౌలు ధరలు అధికంగానే ఉన్నాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల్లో సెనగ సాగు చేసే పొలాలకు గరిష్ఠంగా రూ.18వేల నుంచి రూ.22వేల వరకు చెల్లిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో కౌలు ధరలు అధికంగా ఉండటంతో కొందరు రైతులు ఉత్తరాంధ్రకు వెళ్లి సాగు చేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో పత్తిసాగు క్రమంగా పెరుగుతోంది. ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు కౌలుగా చెల్లిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కోర్టు తీర్పును ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోంది'