prestigious award for Nageshwar Reddy: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల ఛైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డికి అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఈవో) ప్రతిష్ఠాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని (లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు) ప్రకటించింది. ఆయన ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు కావడం గమనార్హం.
ఈ మేరకు బుధవారం డబ్ల్యూఈవో మాజీ అధ్యక్షుడు, అవార్డుల కమిటీ ప్రొఫెసర్ జీన్ ఫ్రాంకోయిస్ రే అభినందన లేఖను పంపించారు. పురస్కార కమిటీ డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయన ఎండోస్కోపీలో చేసిన పరిశోధనలు, ప్రచురణలు, ఆవిష్కరణలను ప్రశంసించారు. 2022 మేలో జపాన్‌లోని టోక్యోలో జరిగే ప్రపంచ ఎండోస్కోపీ కాంగ్రెస్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో డాక్టర్ నాగేశ్వరరెడ్డిని మూడు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. తొలుత అమెరికన్ సొసైటీ ఆఫ్ జీఐ ఎండోస్కోపీ నుంచి రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డును దక్కించుకున్నారు. తర్వాత అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ ఫెలోషిప్ వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘డబ్ల్యూఈవో జీవిత సాఫల్య పురస్కారం దక్కడం సంతోషకరం. ఎండోస్కోపీ చికిత్సల్లో ప్రమాణాలు, నాణ్యత, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ సంస్థ ముందుంటుంది. ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది’ అని అన్నారు.
ఇదీ చూడండి: