తెలంగాణలో ఆదివారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా.. శనివారం రాత్రి 9గంటల వరకు ఎంసెట్ ప్రవేశాల కమిటీకి కళాశాలల జాబితా అందలేదు. ఫలితంగా ఆదివారం వెబ్ ఆప్షన్లు ఉంటాయా అన్న దానిపై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. వెబ్ ఆప్షన్లు మొదలయ్యే వరకు బీటెక్, బీఫార్మసీ సీట్ల సంఖ్య తెలియకపోవడం వల్ల విద్యార్థులు హడావిడిగా ఐచ్ఛికాలు ఇస్తూ నష్టపోతున్నారు. ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి 9 గంటల తర్వాత అనుమతి జీవో..
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా.. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ప్రభుత్వం కొత్త కోర్సుల సీట్లకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం గమనార్హం. ఆయా వర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఎంసెట్ ప్రవేశాల కమిటీకి పంపడం.. అనంతరం విద్యార్థులకు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే సరికి ఆదివారం సాయంత్రం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
జేఎన్టీయూహెచ్లో 18, 210 కొత్త కోర్సుల సీట్లు..
దేశవ్యాప్త విధానంలో భాగంగా రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, ఓయూ, కాకతీయ విశ్వవిద్యాలయాలు పలు కొత్త కోర్సులకు కళాశాలల నుంచి దరఖాస్తు స్వీకరించాయి. కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర ధ్రువపత్రం జారీ చేయాలి. కళాశాలల వారీగా కొత్త కోర్సుల జాబితాను రెండు నెలల క్రితమే జేఎన్టీయూహెచ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీ పరిధిలో బీటెక్ కృత్రిమ మేథా, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెటా సైన్స్ తదితర ఆరు రకాల కొత్త కోర్సుల్లో మొత్తం 18,210 సీట్లు కావాలని కాలేజీలు దరఖాస్తు చేశాయి. అందుకు పలు కశాళాలల్లో 13,800 డిమాండ్ లేని సీట్లను రద్దు చేసుకున్నాయి. వాటికి అనుమతి రాకపోవడం వల్ల ఈ నెల 12 నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 18కి వాయిదా పడింది.
రెండు వర్సిటీలకు వెల్లడి కానీ జీవోలు
శనివారం రాత్రి 9 గంటల తర్వాత విద్యాశాఖ 18,210 సీట్లకు ఎన్ఓసీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త సీట్ల వల్ల జేఎన్టీయూహెచ్ పరిధిలో మొత్తం రూ.33.85 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఓయూ, కాకతీయ వర్సిటీల పరిధిలోని కళాశాలలు కూడా కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. ఓయూ పరిధిలో 1170 కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు వర్సిటీల జీవోలు వెల్లడి కాలేదు.
సకాలంలో కళాశాలల ప్రక్రియ ముగించినా..
తెలంగాణలో దాదాపు 190 కళాశాలలు.. వాటిల్లో పదుల సంఖ్యలో బ్రాంచీలున్నాయి. అందుకే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి కనీసం వారం పది రోజులు ముందుగా కళాశాలలు, వాటిల్లో బ్రాంచీలు, సీట్ల సంఖ్య వివరాలు వెల్లడిస్తే విద్యార్థులు పూర్తిగా తెలుసుకొని వెబ్ ఆప్షన్లు సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంది. వర్సిటీలు మాత్రం వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యే నాడే కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేస్తున్నాయి. అదేమంటే అనుమతి రాని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయన్న ఆలోచనతో అలా చేస్తుంటామని జేఎన్టీయూహెచ్ వర్గాలు అంతర్గతంగా చెబుతుంటాయి. ఈసారి వర్సిటీ సకాలంలోనే తన ప్రక్రియను ముగించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఉత్కంఠకు గురయ్యారు.
ఎంసెట్ గణాంకాలివీ..
* ఎంసెట్లో ర్యాంకులు పొందిన వారు దాదాపు 85 వేల మంది
* ఈనెల 17 వరకు కౌన్సెలింగ్ స్లాట్ బుక్ చేసుకున్నవారు 55,812
* ఆక్టోబర్ 17 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు 43,721
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి'