రాష్ట్రంలో పరిణామాలు వివరించేందుకు తెదేపా ఎంపీల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది. ఉదయం 11గంటలకు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. పదమూడు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు.
భారత ప్రజాస్వామ్య నాలుగు ఎస్టేట్లపై వైకాపా దాడులు చేస్తోందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు చేస్తున్న హింస, విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తెదేపా సహా ఇతర ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు.
కేంద్ర మంత్రులతో భేటి
రాష్ట్రపతితో భేటీ అనంతరం తెదేపా ఎంపీలు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశమై...నరేగా పనులకు 13నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్రం అనేక లేఖలు రాసినా... రాష్ట్రప్రభుత్వం బేఖాతరు చేయటాన్ని తోమర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇళ్లస్థలాల చదునులో 1,560కోట్ల స్కామ్‌లపై ఫిర్యాదు చేయనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు