సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నాల్గోరోజు తెలుగుదేశం ముస్లిం మైనార్టీ నేతలు ...సలాంకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరులో తెదేపా నేతలు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపారు. చుట్టగుంటలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించారు. నందిగామ జామీయా మసీదులో మాజీ మంత్రి దేవినేని ఉమ ముస్లిం నేతలతో కలిసి ప్రార్థనలు చేశారు. సలాం ఆత్మహత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని సర్కారు చూస్తోందని మండిపడ్డారు.
నంద్యాలలో సలాం బంధువులను మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఫరూక్ సుబ్లీ పరామర్శించారు. ఆత్మహత్యల ఘటనకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులతోనే సలాం కుటుంబం చనిపోయిందని అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా మైనార్టీ నాయకులు మండిపడ్డారు. మృతుల ఆత్మ శాంతి కోరుతూ ఆర్ అండ్ బి బంగ్లా నుంచి గడియార స్తంభం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. పెనుకొండలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు సంఘీభావ ర్యాలీ తీశారు.
రాజమహేంద్రంలో జాంపేట మసీదు వద్ద తెలుగుదేశం నేతలు ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ , ముస్లిం నేతలు ఇందులో పాల్గొన్నారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో తెదేపా నేతలు శ్రేణులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని కూన రవికుమార్, గుండ లక్ష్మిదేవి మండిపడ్డారు.
ఇదీ చదవండి