Tdp Comments On Ysrcp Ministers : ముఖ్యమంత్రి విశాఖ కాకపోతే ఇడుపులపాయకు వెళ్లి ఉండవచ్చని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటూ రాజ్యసభలో విజయసాయి ప్రైవేటు బిల్లు పెట్టారని.. లేని అధికారంతో ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి బిల్లు పెట్టలేరన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతేనని హైకోర్టు స్పష్టం చేయటంతోపాటు.. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లి వచ్చిందని గుర్తుచేశారు. అమరావతిపై అవగాహన లేని ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తున్నారని.. దీనిపై చర్చకు తామెప్పుడూ సిద్ధమేనన్నారు. అధిక ధరలు, అమరావతి, పోలవరం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం వంటి అనేక ప్రజాసమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుబడతామని తెలిపారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా ప్రయత్నం : మాట తప్పటం, మడమ తిప్పటంలో జగన్మోహన్ రెడ్డి పేటెంట్ అని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. అమరావతికి 5కోట్ల ప్రజల మద్దతు ఉన్నా.. జగన్ రెడ్డి మద్దతు లభించట్లేదని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమానికి ప్రధాని మోదీ వెనక్కి తగ్గితే.. సీఎంగా ఉన్న జగన్ ఎందుకు మనసు మార్చుకోవట్లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు చర్యల వల్ల రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులు నేడు హక్కుల కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. విశాఖలో భూములు లూటీ చేసే కుట్రలో భాగంగానే అమరావతి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు.
కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన : అమరావతి రైతుల్ని మంత్రి జోగి రమేష్ కించపరిచారంటూ మచిలీపట్నం, పెడనలల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జోగి రమేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
అదే జగన్ రెడ్డి వ్యూహం: అమరావతిని నాశనం చేయడమే జగన్ రెడ్డి వ్యూహ్యమని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి రైతులు వెయ్యి రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని మండిపడ్డారు. కక్ష, కుట్రలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆక్షేపించారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతమైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భయం అని ఎద్దేవా చేశారు.
అమరావతి విషయంలో వైకాపా రాజకీయం : అమరావతి రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకు వైకాపా రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. రాజధాని రైతులకు వస్తున్న ఆదరణను చూసి వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు లేవనెత్తకుండా డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అమరావతి రైతులపై కేసు నమోదు చేసి.. ఇప్పుడు అరెస్టు చేయడమేంటని మండిపడ్డారు.
అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకొచ్చినా అందుకు తగ్గ ప్రతివ్యూహంతో సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రేణులకు సూచించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: