శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా అని ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. మీ పత్రికా ప్రకటనలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనపడటం లేదు జగన్ రెడ్డి అంటూ విమర్శించారు. కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా అని మండిపడ్డారు. అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఇదేనా మహిళా దినోత్సవం రోజు.. మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం అంటూ లోకేశ్ దుయ్యబట్టారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే తెలుగింటి ఆడపడుచులకు అవమానమా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. కనీసం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే హక్కు కూడా మహిళలకు లేదా, గుడికి బయలుదేరితే అమానుషంగా అడ్డుకుంటారా అని మండిపడ్డారు. ఏపీలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందన్న సోమిరెడ్డి... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే అమరావతిలో మహిళలను అవమానించిన వైకాపా ప్రభుత్వం తీరు బాధాకరమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మహిళలు దుర్గమ్మ గుడికి కూడా వెళ్లకుండా అడ్డుకునే హక్కు సీఎంకు ఎవరిచ్చారని ఆమె నిలదీశారు. అమరావతి మహిళలు ఏం తప్పు చేశారని పోలీస్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా అమలు చేయక మహిళలు బలైపోతున్నారని విమర్శించారు. మహిళలే వైకాపాకు త్వరలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
దిశ లేని పాలనలో మహిళల రక్షణ కరువైందని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. గన్ కన్నా ముందొస్తానన్న జగన్ ఎక్కడ అని నిలదీశారు. మహిళకు రక్షణ లేని రాష్ట్రంగా.. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. పులివెందుల దళిత మహిళపై అత్యాచార సంఘటనే ఇందుకు ఉదాహరణ అన్నారు. మహిళా దినోత్సవం చేసే అర్హత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రక్షణ కల్పించలేని ప్రభుత్వం.. మహిళలకు క్షమాపణ చెప్పి.. తల్లి, చెల్లి, బిడ్డల సాక్షిగా వైఫల్యం ఒప్పుకోవాలని జవహర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు