కరోనా కష్ట కాలంలో..... తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కృష్ణా జిల్లా వీరులపాడులో తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని పెనమలూరులో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. కరోనా బాధితులను ఆదుకోవాలంటూ మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం అయ్యప్పనగర్‌లో ఇళ్ల స్థలాల లే అవుట్‌ను సందర్శంచిన ఆయన... తమ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని దుయ్యబట్టారు. 10 డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని విజయవాడ పటమట తహసీల్దార్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్‌బాబులు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు, తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర నిరసన వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోనూ తెలుగుదేశం నేతలు ఆందోళనలు నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని... అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. అనపర్తి, రంగంపేట, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేటలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెదేపా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి, దత్తలూరు, వరికుంటపాడు, జలదంకిలో తెదేపా నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిమాండ్లతో కూడిన ప్లకార్డులను పూల వృక్షానికి వేలాడ దీసి నిరసన తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కరోనా మృతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. చీరాల, పర్చూరు, మార్టూరు, కారంచేడు, చినగంజాంలోనూ తెలుగుదేశం నేతలు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆందోళనకు దిగారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి..... 50లక్షల బీమా అందించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలోనూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద తెలుగుదేశం నిరసన చేపట్టింది. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. కరోనా వైరస్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి, ఆమదాలవలసలో కూనరవికుమార్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, నాతవరం తదితర మండలాల్లోని తెదేపా నాయకులు మండల అధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ... అనంతపురం జిల్లా కదిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం నేతలు ధర్నా చేపట్టారు. కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మడకశిర తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తెదేపా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం అన్నాక్యాంటీన్లు తెరిచి... కరోనా కాలంలో పేదల ఆకలి తీర్చాలని హిందూపురంలో తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే... నిరసనలు ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. TDP committees: రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలు