దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా మూడు కోట్ల లీటర్ల పాల రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. లాక్డౌన్ సమయంలో దేశ రాజధాని ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రవేశపెట్టిన దూద్ దురంతో ప్రత్యేక రైలు ద్వారా రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు ఈనెల 28వ తేదీ వరకు నిరంతరాయంగా 3కోట్ల లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు.
సాధారణంగా దూద్ దురంతో ప్రత్యేక రైలు ఒక్కొక్క ట్యాంకులో 40 వేల లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన 6 పాల ట్యాంకర్లతో 2.40 లక్షల లీటర్ల పూర్తి సామర్థ్యంతో నడపబడుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 751 పాల ట్యాంకర్ల ద్వారా 126 ట్రిప్పులతో రవాణా చేశామన్నారు. రేణిగుంట నుంచి దేశరాజధానికి కాచిగూడ మీదుగా ప్రత్యేక రైలును నిరంతరం నడిపిస్తున్నామన్నారు. సుమారు 56 పార్శిల్ వ్యాన్లు ఈ రైలుకు జత చేసి నిత్యావసర సరుకులు సైతం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మామిడిపండ్లు, కర్జూరా పండ్లు, చైనా క్లే, హార్డ్ పార్శిళ్లు రవాణా చేశామన్నారు. 191 పార్శిల్ వ్యాన్ల ద్వారా సుమారు 4,039 టన్నుల సరుకు రవాణా చేశామన్నారు.
ఇదీ చదవండి: