ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు సంస్కరణల సెగ తగులుతోంది. పాఠశాల విద్యలో సంస్కరణలు, జూన్‌లో వచ్చిన రెగ్యులర్ పదో తరగతి ఫలితాలు విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపాయి. మరోపక్క కరోనా సమయంలో ఫీజులు చెల్లించలేక ప్రైవేటు బడుల నుంచి వచ్చినవారిలోనూ కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారు. పాఠశాలల విలీన నిర్ణయం కొందరు విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేస్తోంది. కొన్నిచోట్ల వాగులు, వంకలు, ప్రధాన, జాతీయ రహదారులు దాటి విలీన పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు వారిని దగ్గర్లో ఉన్న, లేదా రవాణా సదుపాయం ఉన్న ప్రైవేటు బడులకు పంపుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ పదోతరగతి ఫలితాలు పడిపోవడంతోనూ కొందరు ప్రైవేటు బాట పట్టారు. విద్యార్థులు వెనక్కి వెళ్లిపోవడంపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ముగిస్తే గానీ ఎందరు టీసీలు తీసుకున్నారనే వివరాలు తెలియవు. పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఇలా ప్రభుత్వ బడుల్లో టీసీలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో సీట్ల కోసం ఇప్పటికీ సిఫార్సు లేఖలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కొవిడ్ తగ్గడమా.. సంస్కరణలా?
కరోనా కారణంగా గత రెండేళ్ల్లుగా ప్రైవేటు పాఠశాలలు సరిగా కొనసాగలేదు. దానికి తోడు తల్లిదండ్రుల ఆదాయాలు పడిపోయి ప్రైవేటులో ఫీజులు చెల్లించలేక కొందరు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చారు. ఇప్పుడు కొవిడ్ తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ఇలాంటివారిలో కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
* కరోనా సమయంలో మూతపడిన ప్రైవేటు బడుల్లో కొన్నింటిని ఈ ఏడాది తెరిచారు. గతంలో ఈ బడుల నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు అటు మొగ్గుచూపుతున్నారు.
* గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన అమ్మఒడి ఆర్థికసాయాన్ని జూన్‌లో ఇచ్చారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆ మొత్తానికే చదువు చెబుతామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రవేశాల సమయంలో రూ.5వేలు చెల్లిస్తే చాలంటూ పిల్లల్ని చేర్చుకుంటున్నాయి.
* విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం చేపట్టారు. చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే ఉన్నారు. ఉపాధ్యాయుల కొరత కొన్నిచోట్ల ప్రవేశాలపైప్రభావం చూపుతోంది.
* పభుత్వ పాఠశాలల్లో జూన్‌లో విడుదల చేసిన రెగ్యులర్ పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. చాలా బడుల్లో 50% లోపే వచ్చాయి. పదోతరగతిలో ఫెయిలైన పిల్లల తోబుట్టువులను తల్లిదండ్రులు కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలకు మారుస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరేవారిలో 6,7,8,9 తరగతుల వారూ ఉంటున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో టీసీలు అడుగుతున్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ చేస్తున్నారు.
* అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం మంగళాపురం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 6,7,8 తరగతులను విజయరాజుపేట పాఠశాలలో విలీనం చేయగా.. 35మందికి 15మందే విలీన బడిలో చేరారు.
* గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7 తరగతులను అల్లంవారిపాలెం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. 45మందిలో 30మంది టీసీలు తీసుకెళ్లారు.
* నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలోని నిడుముసులు ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల్లో 11మందికి టీసీలు ఇవ్వగా.. తొమ్మిది మంది మాత్రమే ప్రాథమికోన్నత బడిలో చేరారు. ఇప్పుడు 1,2తరగతుల్లో ఐదుగురేమిగిలారు.
* అనంతపురంలోని ఓ పురపాలక ఉన్నతపాఠశాలలో 120మంది వరకు టీసీలు తీసుకున్నారు.
ఇవీ చదవండి: