BJP leaders met Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర భాజపా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని హరిత ప్లాజాలో సమావేశమయిన నేతలు తెలంగాణ విమోచన వేడుకలు ఏడాది పాటు నిర్వహించే అంశాలు, మునుగోడు ఉప ఎన్నిక సహా తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భాజపా కోర్ కమిటీ భేటీలో బూత్ కమిటీలు పక్కాగా పనిచేయాలని నిర్దేశించారు.
గ్రామలవారీగా ఇంఛార్జ్‌ల నియామకం పూర్తిచేయాలని, పార్టీలో చేరికలను ప్రోత్సహించేలా పనిచేయాలని భేటీలో సూచించారు. జాయినింగ్ కమిటీ ప్రగతిపై అమిత్‌షా ఆరా తీశారు. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాలని సూచించారు. భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహరచన ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఇచ్చిన కార్యక్రమాల ఫీడ్ బ్యాక్‌ను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్ అయ్యిందని... కాంగ్రెస్, తెరాస ఎప్పుడైనా ఒకటవుతాయనే విషయాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా అర్థం అయ్యేలా చేయాలని దిశానిర్థేశం చేశారు.
ఎన్నికల తరువాత కాంగ్రెస్, తెరాస పొత్తు ఉండొచ్చని కోర్ కమిటీలో అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. కోర్ కమిటీ సమావేశం ముగించుకున్న అనంతరం సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌కు బయల్ధేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఆ కార్యక్రమం ముగించుకుని మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమిత్ షా.. మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లిన అమిత్ షా అధికారులతో సమావేశం అయ్యారు.
అంతకుముందు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అమిత్ షాను కలిశారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు అయన తెలిపారు. రాజకీయ అంశాలు మాట్లాడలేదని... క్రీడల అభివృద్దిపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. క్రీడల్లో పురోగతిపై వివిధ అంశాలు చర్చకు వచ్చాయని గోపిచంద్ తెలిపారు.
ఇవీ చదవండి: