ప్రతి ఒక్కరి జీవితంలో బంధాలు అనుబంధాలు ఉంటాయి. ఆ బంధాల్లో స్నేహ బంధానికి ఉన్న గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని బంధాల్లాగే స్నేహ బంధంలోనూ కోపతాపాలు ఉంటాయి. అలకలు.. చిన్నిచిన్ని గొడవలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ గొడవలు వారి మధ్యలో ఉన్న ప్రేమానురాగాలతో సద్దుమణిగితే... మరికొన్ని పంతాలు పట్టింపులతో రెట్టింపు అవుతాయి. కొందరు చిన్నచిన్న కారణాలతో నేనే గొప్ప అనే అహంతో దూరం అవుతుంటారు. మాట్లాడాలని ఉన్నా.. పెరిగిన దూరం వల్ల మౌనం వారి ఇద్దరి మధ్యలో రాజ్యమేలుతుంది. ఇద్దరిలో ఎవరు రాజీకి రారు. తమ స్నేహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించరు.
వెయ్యేళ్లు బతుకుతావా..?
అలాంటి వారికి ఓ సూటి ప్రశ్న. ఓ వందేళ్లు తిట్టుకుని... మరో వందేళ్లు కొట్టుకొని.. మిగతా 800 ఏళ్ల కాలాన్నీ సరదాగా గడిపేందుకు మీరు వెయ్యేళ్లు బతుకుతారా మిత్రమా...! మనం బతికేదే కొన్నాళ్లు అందులో ఏ మహమ్మారో సోకితే... ఏ జరగరాని ఘోరమో జరిగితే... ఒక్కసారి ఆలోచించు. రెప్ప పాటులో మన ప్రాణం పిట్టలా ఎగిరిపోతుంది. ఈ చిన్ని జీవితంలో.. స్నేహితులు తిట్టారనో.. నీతో సరిగా మాట్లాడట్లేదనో... నీ గురించి తప్పుగా చెప్పారనో... ఇలా కడుపు నింపని కారణాలతో... ఖరీదు చేయలేని కాలాన్నీ పంతాలు పట్టింపులతో వృథా చేయడం అవసరమా...? ఒక్కసారి ఆలోచించు మిత్రమా... !
- ఇదీ చదవండి . Friendship: స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!
తిరిగిరాని కాలన్ని తిరిగి చిగురించిన స్నేహం తీసుకురాదు కదా...
జరిగిన దానికి నువ్వే సారీ చెప్పాలి. నువ్వే మాట్లాడాలి అనే ఇగోతో రోజులు పరుగెడుతుంటాయి. వారిపై ఇదే కోపంతో నువ్వు జీవితాంతం ఉంటావా...? ఒకరిపై ద్వేషంతో రగిలిపోవడమే జీవితపు పరమార్ధమా...? ఎప్పుడో ఓ చోట నీ ఈగో కారణంగా దూరం అయిన మిత్రుడు మళ్లీ తారస పడితే మాట్లాడకుండా ఉండగలవా...? అలా ఎన్ని సార్లు ఎన్ని రోజులు. ఈరోజు ఉన్నంత కోపం రేపు ఉంటుందా...? రేపు ఉన్న కోపం ఆ మర్నాడు ఉంటుందా...? ఎప్పుడో ఓ నాడు తగ్గిపోతుంది కదా... ! ఆ తగ్గేదేదో ఇప్పుడే తగ్గించుకొని ఓ 'సారీ' చెప్పి... మాట్లాడితే నీ కిరీటం ఊడి కింద పడిపోతుందా...? నీ సామ్రాజ్యం అతలాకుతలం అవుతుందా..? అలా చేస్తే ఇంకొన్ని మధుర క్షణాలని ఈ చిన్న జీవితంలో పోగుచేసుకోవచ్చు కదా.
కూర్చొని మాట్లాడుకోండి..
నీ క్లోజ్ ఫ్రెండే నీ గురించి తప్పుగా అన్నాడు. అంటే పోయేదేముంది. అన్నది నీ ఫ్రెండే కదా... ! ఓకే ఏదో అన్నాడు. అన్నది నువ్వు విన్నావా..? ఎవరో చెప్పింది విని నిజమని నమ్ముతున్నావా..? సరే అన్నాడు ఏమన్నాడు..? పోనీ నేరుగా వెళ్లి నా గురించి ఇలా ఎందుకు అన్నావ్ అని అడిగావా..? ఒకవేళ ఏదో అన్నాడు.. అన్నంత మాత్రాన అబద్ధం నిజమై పోతుందా...? ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.. మీ బంధం బలపడుతుంది కదా. ఏదైనా సమస్య వస్తే కలిసి మాట్లాడుకోండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో మౌనం అపోహలకు బలాన్ని చేకూరుస్తుంది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే..
స్నేహం.. బహుబంధాల ఆనందాల కలయిక. తాళి కట్టిన భార్యలా... కష్టాల్లో ఇష్టాల్లో చితిదాకా తోడొచ్చే ఓ మధురానుబంధం. అలాంటి బంధాలకు.. ఆ బంధాలతో బతుకు నావను నడిపే స్నేహితులకు "స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు".