తెలంగాణలో.. గత ప్రభుత్వాలు ముందుచూపు కొరవడి అక్కడి ప్రజలకు చెరువు భూముల్లో పట్టాలు ఇవ్వడంతో ఇళ్లు కట్టుకున్నారు. ఒకటి రెండు ఇళ్లు కాస్తా ఓ కాలనీగా వెలిసింది. ఎప్పుడు వర్షాలు పడ్డా ఈ కాలనీకి వరద తాకిడి ఉండేది కాదు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద ప్రవాహం ఎక్కువై కాలనీని ముంచెత్తింది. చెరువులోకి చేరుతున్న వరదనీరును దిగువకు పంపడానికి సకాలంలో తూము తెరుచుకోకపోవడమే వందల కుటుంబాలు రోడ్డునపడేలా చేసింది. అలాగే చెరువు అలుగుపొంగి దిగువనున్న సుభాష్ నగర్, జీడిమెట్లలోని పలు ప్రాంతాల్లో వరదనీరు చేరింది.
ఫాక్స్ సాగర్ ఉగ్రరూపం
ఫాక్స్‌సాగర్ చెరువునకు 37 అడుగుల నీటిసామర్థ్యం ఉంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాలకు 34 అడుగులకు నీటిమట్టం చేరింది. అప్పటికే అలుగు పొంగి సుభాష్‌నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్ లోని నివాసాలను వరద తాకింది. ప్రవాహం ఎక్కువైతే ఆయా ప్రాంతాల్లోని 70 వేల కుటుంబాలు నిరాశ్రయులుగా మారే ప్రమాదం పొంచి ఉండటంతో తూమును తెరిచే ప్రయత్నం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వచ్చిన నిపుణుల బృందం... 48 గంటలపాటు శ్రమించి... ఎట్టకేలకు తూము గేట్లను తెరవగలిగారు. చెరువులోని నీరును క్రమంగా వదలడంతో పెను ప్రమాదాన్ని నివారించగలిగారు. ఈ విపత్తు.. రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. చెరువు శిఖం భూముల ఆక్రమణ, నాలాలపై అక్రమ నిర్మాణాలే ప్రస్తుత ముంపునకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 480 ఎకరాల్లో ఉన్న చెరువు... కాలక్రమేనా కబ్జా కోరల్లో చిక్కి సగానికిపైగా అన్యాక్రాంతమైనట్లు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ చెరువు విస్తీర్ణం ఎంతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అంతలా ఆక్రమణలకు గురైనట్లు స్థానిక ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులే అంగీకరిస్తున్నారు.
మూసీని తలపిస్తోన్న ఫాక్స్‌సాగర్
చెరువు కింద వందల ఎకరాల్లో ఆయకట్టు సాగయ్యే ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారింది. పారిశ్రామిక వాడ కావడంతో వందల సంఖ్యలో పరిశ్రమలు వెలిశాయి. రసాయనాలను మోసుకెళ్లేందుకు నిర్మించిన నాలా కూడా ఆక్రమణలకు గురవడంతో రసాయనిక జలాలు, మురుగునీరంతా చెరువులో కలవాల్సిందే. దీంతో స్వచ్ఛమైన జలాలతో ఉండే ఫాక్స్ సాగర్.... మూసీని తలపిస్తోంది. జలచరాలు కూడా జీవించలేని స్థితికి వచ్చింది. ఈ చెరువుపైనే ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాల జీవనాన్ని దెబ్బతీసింది.
అదే నిదర్శనం
వాస్తవానికి ఫాక్స్ సాగర్‌లో చేరిన వరద నీరంతా హుస్సేన్ సాగర్‌లోకి చేరాలి. సుభాష్‌నగర్, ఫతేనగర్ నాలా మీదుగా హుస్సేన్ సాగర్ లో కలవాలి. కానీ ఎప్పుడు ఈ చెరువు అలుగు పొంగింది లేదు. తూములు తెరిచింది లేదు. ఇదే అవకాశంగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు.... సుభాష్ నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్ సహా ఎగువనున్న శిఖం భూముల్లో యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు. అడ్డుచెప్పే వారు లేక ప్రైవేటు వ్యక్తులదే రాజ్యంగా మారింది. వరద ప్రవాహానికి ఆ నిర్మాణాలన్నీ అడ్డుగా మారాయి. అలాగే ఈ చెరువుకు ఎగువన 12 గొలుసుకట్టు చెరువులున్నాయి. మైసమ్మగూడ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, కొంపల్లి లోని చెరువుల నీరంతా పాక్స్ సాగర్ లో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయి ఇటీవల వర్షాలు ఎంతటి భీభత్సాన్ని సృష్టించాయో ఉమామహేశ్వర కాలనీనే నిదర్శనం.
ఫాక్స్ సాగర్‌కు పూర్వవైభవం వచ్చేనా..
అయితే ఫాక్స్‌సాగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను మరోసారి దృష్టి సారిస్తామని అధికార యంత్రాంగంచెబుతోంది. రికార్డుల ప్రకారం అక్రమమని తెలితే వారికి ప్రత్యమ్నాయంగా మరోచోట ఆవాసాన్ని కలిపిస్తామంటున్న స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్...ఫాక్స్ సాగర్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తామని చెబుతున్నారు.
స్థానికులు మాత్రం కబ్జాలపై గట్టిగా కొరడా ఝులిపించాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువులో నీళ్లు తగ్గకుండా చూసి చుట్టుపక్కల భూగర్భజలాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌కు గిన్నిస్ రికార్డు