Rajyasabha: కాంగ్రెస్ పార్టీ తనపై తప్పుడు కేసులు బనాయించకపోతే తాను ఈ సభకు వచ్చే వాడినే కాదని, ఈ విషయం చెప్పకపోతే తన బాధ్యతను నెరవేర్చడంలో తాను విఫలమైనట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లోపు పదవీకాలం ముగియనున్న సభ్యుల గౌరవార్థం రాజ్యసభలో గురువారం ప్రత్యేక చర్చ నిర్వహించారు.
కాంగ్రెస్ కారణంగానే ఈ సభకు వచ్చా
‘‘రాజ్యసభ ఛైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలోని సభలో సభ్యునిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్, అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్, ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ నాకు ఎంతో మార్గదర్శనం చేశారు. టి.జి.వెంకటేష్ తిరిగి సభకు వస్తారని, తిరిగి రవాణా, పర్యాటక స్థాయీ సంఘానికి ఛైర్మన్‌గా ఉంటారని ఆశిస్తున్నా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ కేబినెట్‌లో బాగా కష్టపడే మంత్రి. వైకాపాపై ఆమె దయతో అందుబాటులో ఉండేవారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారకుడిగా జైరాం రమేష్‌ను ఆంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కానీ వ్యక్తిగతంగా నాకు ఆయన మంచి మిత్రుడు’’ -విజయసాయిరెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత
రాజకీయాలు, సంక్షేమ కార్యక్రమాల నుంచి విశ్రాంతి తీసుకోను:
"నేను పర్యాటకం, రవాణా, సాంస్కృతిక స్థాయీ సంఘం ఛైర్మన్‌గా రాణించా. ఎమ్మెల్యేగానూ ప్రతిభ చూపా. అనేకమంది పెద్దలు మా కమిటీలో ఉన్నారు. మీతో (వెంకయ్య నాయుడును ఉద్దేశించి) నలభై సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నా. ఇద్దరం ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్నాం. కానీ నేను రాజకీయాల నుంచి, సంక్షేమ కార్యక్రమాల నుంచి విశ్రాంతి తీసుకోను"
టి.జి.వెంకటేష్, భాజపా రాజ్యసభ సభ్యుడు
చంద్రబాబు, మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా..
‘‘రాజకీయాల్లో, సభలో నా ప్రయాణం 12 ఏళ్లు. నన్ను రెండుసార్లు సభకు పంపించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పకుంటే నేను విఫలమైనట్లే. ఈ రోజు ఆ పార్టీతో, ఆయనతో విభేదించినా.. ఆయన కష్టపడే తీరును, దేశానికి ఆయన అందించిన సేవలను గౌరవిస్తా. నేను భాజపా నుంచి, మంత్రివర్గ సభ్యునిగా చేసినప్పుడు మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మార్గదర్శి అరుణ్ జైట్లీని మర్చిపోలేను. మాజీ ఛైర్మన్ హన్సారీ, వైస్ ఛైర్మన్ కురియన్, ప్రస్తుత ఛైర్మన్ వెంకయ్య నాయుడుల నుంచి ఎంతో నేర్చుకున్నా"
- వై.ఎస్.చౌదరి, భాజపా రాజ్యసభ సభ్యుడు
దిగ్గజాల సభలో ఉండడం అదృష్టం
"నేను సభకు వచ్చినప్పుడు మా సభా నాయకునిగా వై.ఎస్.చౌదరి ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. దిగ్గజాల సభలో ఉండడం నా అదృష్టం. రాజకీయాలతో సంబంధం లేకుండా విజయసాయిరెడ్డి పనితీరును నేను ప్రశంసిస్తున్నా. సుజనా, విజయసాయి తిరిగి సభకు వస్తారని ఆశిస్తున్నా"
కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా రాజ్యసభ సభ్యుడు
ఇదీ చదవండి: Share of Tax Increased: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పెరిగిన వాటా.. ఎంతంటే..!