పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్ని లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తారని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. కొవిడ్ నెగిటివ్ ఉన్నవారు లేదా.. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధృవపత్రాలను 48 గంటల ముందు అందజేస్తేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసిందన్నారు. పరీక్షల నిర్వహణకు అటువంటి ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా పాటిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరోనా రెండోదశ పరిణామాలు ఊహించని విధంగా ఉంటే.. పరీక్షల నిర్వహణ పట్ల అంత పంతాలు, పట్టింపులు ఎందుకో అర్థం కావటం లేదన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి.. వైద్యానికి లక్షలాది రూపాయలను వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది మందికి ముప్పు పొంచి ఉందని గ్రహించే.. కేంద్రం సహా వివిధ రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేయటమో.. రద్దు చేయటమో చేశాయన్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం తగదన్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముందు వైద్య సదుపాయాలు పెంచి ప్రజలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..