కొవిడ్ శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తోంది. కొవిడ్ అనంతరం కొందరు కుంగుబాటు, ఆందోళన, చికాకు, కోపంతో బాధపడుతున్నారు. వీటిని వైద్య పరిభాషలో ‘పోస్టు ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్’గా మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం... మానసిక సమస్యలతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలోని బోధనాసుపత్రులకు 55 వేల మంది, పీహెచ్‌సీలకు 37 వేల మంది వరకు వచ్చారు. వీరిలో కొందరు కొవిడ్ బారినపడి తొలిసారిగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదివరకే మానసిక రుగ్మతలుండి కొవిడ్ సోకిన వారు ఇంకొందరు ఉన్నారు. అనంతపురం జీజీహెచ్‌లో ప్రతినెలా 900 మంది వరకు మానసిక సమస్యలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. తిరుపతి రుయా, కాకినాడ జీజీహెచ్‌కు ప్రతినెలా 1,750 మంది నుంచి 2,500 మంది వస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ప్రతినెలా 2 వేల మంది వరకు వైద్యులను సంప్రదిస్తున్నారు.
జబ్బు తిరగబెట్టింది
ఇప్పటికే మానసిక రుగ్మలతో బాధపడుతూ వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్న వారు కొవిడ్, ఇతర కారణాలతో నిలిపేశారు. అలాంటి వారు ఇప్పుడు మళ్లీ ఆసుపత్రులకు వస్తున్నారు. మానసిక వైద్యంలో మందులను వెంటనే ఆపకూడదు. మరికొందరికి కొవిడ్ భయం పెరిగి... మందులను మార్చాల్సి వచ్చింది. మానసిక సమస్యలున్న వారి పరిస్థితిని అనుసరించి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మందులు వాడాల్సి ఉంటుందని గుంటూరు జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ లోకేశ్వరరెడ్డి తెలిపారు. ఇలాంటి జబ్బులకు చికిత్స పొందే వారు కొవిడ్ టీకా తీసుకోవచ్చన్నారు.
- ‘రాజమండ్రిలో 35 ఏళ్ల యువకుడొకరు ఇంటి నుంచి కార్యాలయానికి పది నిమిషాల్లో వెళ్లేందుకు అవకాశం ఉన్నా... చెట్లు (గబ్బిలాలను దృష్టిలో ఉంచుకుని) లేని ప్రాంతాన్ని ఎంచుకుని అదనంగా మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. కొవిడ్ భయం అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది’ అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి తెలిపారు.
- ‘కొందరు నిద్రలో ఉన్నట్లుండి... కొవిడ్‌తో చనిపోయిన వారి గురించి చెబుతూ... అరుస్తూ కుటుంబ సభ్యులను హైరానాకు గురిచేస్తున్నారు. మా ఆసుపత్రికి వచ్చే పది మందిలో కొవిడ్ రాకున్నా ఆందోళన చెందేవారు ఇద్దరుంటున్నారు. కొవిడ్ సోకి, మానసిక సమస్యలతో వచ్చే వారు ఒకరు ఉంటున్నారు’ అని గుంటూరు జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ పి.లోకేశ్వరరెడ్డి తెలిపారు.
- ‘కొవిడ్ కారణంగా ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. అయితే వారు తమ తండ్రి ఇప్పటికీ బతికే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దవిగా చూసేవారూ ఉన్నారు’ అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శినిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: Bramhotsavalu:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబు