తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం.. జిల్లా కేంద్రానికి 68 కి.మీ. దూరంలో ఉంది. ఇటీవల వర్షాలకు మంజీరా నదికి వరద పోటెత్తడంతో ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలోని 16 నెలల బాలుడు తీవ్ర జ్వరం, కడుపునొప్పితో విలవిల్లాడుతున్నాడు. వైద్యానికి ఎటూ కదల్లేని స్థితిలో ఉండగా.. సమాచారం అందుకున్న వైద్యాధికారులు పక్క మండలం నుంచి ఓ డ్రోన్(Drones usage In Telangana)తో బాలుడికి ఔషధాలు పంపి ప్రాణం నిలిపారు.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఒకే రోజు డ్రోన్ల(Drones usage In Telangana)తో 1.5 లక్షల విత్తన బంతులు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అడవుల్లో ఈ ప్రక్రియ సాగుతోంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. మారుమూల తండాలు, రవాణా, ఇతర వసతులు ఎరుగని పల్లెల్లో, అడవుల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయిప్పుడు. డ్రోన్లు నిమిషాల్లో సంజీవని తెచ్చే పవనపుత్రులవుతున్నాయి. విత్తనాలు కురిపించే హరిత మేఘాలవుతున్నాయి. దేశంలో తొలిసారి వైద్యసేవల్లో డ్రోన్ల(Drones usage In Telangana)(హెపీకాప్టర్లు(Hepi copter drones)) వినియోగంతో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ.. హరితహారంలో భాగంగా వంద కోట్ల మొక్కల పెంపకం లక్ష్య సాధనకు విత్తనాలు జల్లే డ్రోన్ల (సీడ్‌కాప్టర్లు(seed copter drones))ను రంగంలోకి దించి మరో చరిత్ర సృష్టించింది.
అడుగుకో చెట్టు.. ఆకాశం నుంచి విత్తు
![విత్తనాలను కురిపిస్తాయి.. సంజీవనులను మోసుకొస్తాయి](https://assets.eenadu.net/article_img/gh-main14a_76.jpg)
పేరు: సీడ్ కాప్టర్ డ్రోన్(seed copter drones)
పని: అడవుల్లో ఖాళీ స్థలాల్ని గుర్తించి విత్తనాలు చల్లుతుంది. అధునాతన సాంకేతికతతో ఆ ప్రాంతం మట్టి సాంద్రత, మొక్క పెరిగే అవకాశాలనూ చెప్పేస్తుంది.
సామర్థ్యం: ఈ డ్రోన్ ఒకేసారి 1500 విత్తన బంతుల్ని మోసుకెళ్లగలదు.
ప్రయాణించే దూరం: 1 కి.మీ., 30 నిమిషాలు గాల్లో ఉండగలదు.
లక్ష్యం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 12 వేల హెక్టార్ల ఖాళీ స్థలాల్ని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 2030 నాటికి 100 కోట్ల విత్తనాలు నాటనున్నారు.
ప్రారంభం: సెప్టెంబరు 1న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నటుడు దగ్గుబాటి రానా ప్రచారకర్తగా ఉన్నారు. 12 అడవుల్లో విత్తనాలు వేయడం పూర్తయింది.
వాహనాలు వెళ్లలేవు.. ఔషధాలు చేరుతాయి
![విత్తనాలను కురిపిస్తాయి.. సంజీవనులను మోసుకొస్తాయి](https://assets.eenadu.net/article_img/gh-main14b_11.jpg)
పేరు: హెపీకాప్టర్ డ్రోన్(Hepicopter drone)
పని: కొండ ప్రాంతాలు, మారుమూల పల్లెలు, రవాణా లేని చోటుకు మందులు, వైద్య సామగ్రిని సరఫరా చేస్తుంది. రద్దీదారుల్లో అత్యవసరంగా తీసుకెళ్లాల్సిన రక్తం, అవయవాలనూ మోసుకెళుతుంది.
సామర్థ్యం: 5 వేల టీకా డోసులు, 2 వేల ఔషధాలు, రెండు యూనిట్ల రక్తనిల్వలను ఒకేసారి మోసుకెళ్లగలదు.
ప్రయాణించే దూరం: 20 నుంచి 40కి.మీ., 45 నిమిషాలు గాల్లో ఉండగలదు.
లక్ష్యం: ఎక్కడివారికైనా వైద్య సేవల్ని చేరువచేయడం.
ప్రారంభం: సెప్టెంబరు 11న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వికారాబాద్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సేవలను ఇతర జిల్లాలకూ విస్తరించనున్నారు. ఇక్కడి స్ఫూర్తితో మణిపూర్, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ డ్రోన్లతో వైద్య సేవల ప్రారంభానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని సేవలు తెస్తాం
సాధ్యం కాని ఎన్నో పనుల్ని సాంకేతికతను వినియోగించి సాకారం చేస్తున్నాం. పదేళ్లలో అడవుల్లో వంద కోట్ల మొక్కలు నాటేందుకు డ్రోన్లను వినియోగించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో డ్రోన్ల వినియోగంలో తెలంగాణ మొదటి రాష్ట్రంగా నిలుస్తోంది. మరిన్ని సేవలు తీసుకొస్తాం.
- ప్రేమ్‌కుమార్ విస్లావత్, మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు
ఇదీ చూడండి: private travels: దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్దమైన ప్రైవేట్ బస్ ట్రావెల్స్