Schools Reopen in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో కచ్చితంగా కరోనా నిబంధనలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.కాగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందడంతో ఈనెల 30 వరకు సెలవులను పొడిగించారు. రేపటితో సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందని ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.విద్యా సంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించింది.
సెలవుల్లో ఆన్లైన్ తరగతులు...
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కశాశాలల్లో కూడా టీవీ, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు మాత్రమే టీ శాట్, దూరదర్శన్, వాట్సప్ ద్వారా బోధన కొనసాగుతోంది. మహారాష్ట్ర, దిల్లీ, ఏపీ, హరియాణా, తమిళనాడులో విద్యాసంస్థలు తెరవనున్నందున... ఆ దిశగా విద్యాసంస్థలు పునఃప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
తెలంగాణ హైకోర్టులో ప్రస్తావన...
బడుల ప్రారంభంపై శుక్రవారం..తెలంగాణ హైకోర్టులో సైతం ప్రస్తావనకు వచ్చింది. పాఠశాలల విద్యార్థులు టీకాలు కూడా వేసుకోలేదని.. మరోవైపు కరోనా తీవ్రత కొనసాగుతోందని న్యాయవాదులు ఆందోళన వెలిబుచ్చారు. పాఠశాలల ప్రారంభంపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 3న విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చదవండి: AP Employees Protests: ఉద్ధృతంగా మారుతున్న పీఆర్సీ ఉద్యమం.. వారు సైతం సమ్మెలో..