RTC: అదనపు ఆదాయం కోసం బయటి వాహనాల టైర్లకు రిట్రేడింగ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్టీసీకి నాలుగు చోట్ల ఈ యూనిట్లు ఉన్నాయి. వీటిలో బయటి వాహనాల టైర్లకు రిట్రేడింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సంస్థకు చెందిన గ్యారేజీల్లో సొంత బస్సులే కాకుండా బయటి వాహనాలకు మరమ్మతులు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందటంపై యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకు గ్యారేజీలవారీగా ఉన్న సదుపాయాలు, సిబ్బంది తదితర వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న మిషనరీ, సదుపాయాలు, నిపుణులను సద్వినియోగం చేసుకొని, అదనపు రాబడిపై దృష్టిపెట్టాలని కొద్దిరోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై దృష్టిపెట్టారు.
* ఆర్టీసీకి విజయవాడ, విజయనగరం, నెల్లూరు, కడపల్లో టైర్ రిట్రేడింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో నెలకు సగటున 7-8 వేల టైర్లను మెరుగుపరుస్తుంటారు. ఇకమీదట వీటిలో ప్రైవేటు బస్సులు, లారీల టైర్లకు కూడా రిట్రేడింగ్ చేయాలని నిర్ణయించారు. మెటీరియల్‌ను ఆర్టీసీ బల్క్‌గా కొనుగోలు చేస్తుండటంతో, తక్కువ ధరకే వస్తాయి. అందుకే బయటి ధర కంటే, కొంత తక్కువ ధరకు సేవలు అందించాలని నిర్ణయించారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 129 డిపోలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ గ్యారేజ్‌లు ఉన్నాయి. వీటిలో బయటి వాహనాలకు మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. సంస్థలో అనుభవమున్న మెకానిక్‌లు ఉండటంతో వీరి సేవలు వినియోగించుకోనున్నారు. వాహనాలను పైకి లేపే లిఫ్ట్‌లు వంటి సదుపాయాలు ప్రస్తుతం డిపోల్లో లేవు. వీటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బస్సులు, వాహనాల మరమ్మతుల కోసం గ్యారేజీల్లో వేరుగా స్థలం కేటాయించాల్సి ఉంటుంది. అదనంగా అవసరమయ్యే సహాయ సిబ్బందిని పొరుగు సేవల కింద తీసుకోవాలని, బయటి వాహనాలకు సర్వీసింగ్ చేసిన సిబ్బందికి అదనంగా కొంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. టైర్ రిట్రేడింగ్ యూనిట్లు, గ్యారేజీల్లో ఉన్న సదుపాయాలు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నామని.. త్వరలో బయటి వాహనాలకు సేవలు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: