Mahabubnagar Road Accident : భర్త చనిపోయినా బిడ్డలను సాకేందుకు ఉద్యోగం చేస్తున్న తల్లులు! రోజంతా స్టీరింగ్ తిప్పుతూ బతుకుబండి లాగుతున్న డ్రైవర్! ఇంకాసేపట్లో తమవారిని చేరుకుంటామనుకుంటున్న ప్రయాణికులు! ఒకే ఒక్క నిర్లక్ష్యం.. వీరందరి జీవితాలను తలకిందులు చేసింది. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మహబూబ్‌నగర్‌లో గురువారం రోజు జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలితీసుకోగా మరో ముగ్గురిని జీవచ్ఛవాలుగా మార్చేసింది.
వేగంగా దూసుకువచ్చిన కారు..
క్రిస్టియన్‌పల్లికి చెందిన విజయ రాణి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా.. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ఆమెకు దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో సబార్డినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే ఆమె విధుల్లో చేరింది. మహబూబ్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన జ్యోతి భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా.. ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె జూనియర్ అసిస్టెంగ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, అటెండర్ ఖాజా మొయినుద్దీన్ నిన్న సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. వీరంతా దేవరకద్రలో ఆటో ఎక్కి మహబూబ్‌నగర్ వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో అప్పాయిపల్లి వద్దకు రాగానే.. వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో నడుపుతున్న చంద్రశేఖర్‌తో పాటు వెనక కూర్చున్న విజయ రాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన జ్యోతి, శ్రీలత, ఖాజా మొయినుద్దీన్‌తో పాటు మరో ప్రయాణికురాలు కవితను స్థానికులు అతికష్టం మీద బయటకు తీసి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే జ్యోతి ప్రాణాలు విడిచింది.
కారులో మద్యం సీసాలు..
అతివేగంతో ముందున్న వాహనాన్ని దాటేందుకు యత్నించిన కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొనటంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ముందుగా ఘటనాస్థలికి వచ్చిన ఓ హోంగార్డుపైనా ప్రమాదానికి కారణమైన వ్యక్తులు మద్యం మత్తులో చేయిచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు కారులో ఉన్న యువకులను బయటికి లాగి చితకబాదారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్...
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించిన మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్‌రావు సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
ఇదీ చదవండి: nellore accident: ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు