ఆహార భద్రత కార్డులపై కరోనా నేపథ్యంలో లబ్దిదారులకు ఎప్పటికన్నా రెట్టింపు బియ్యం పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల వలస కూలీలకు, రేషన్ కార్డులు లేని వారికి బియ్యం లభించట్లేదు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా అధికారులు చౌక ధరల దుకాణాల్లో ‘బియ్యం విరాళం డబ్బాలు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.మే నెల సరకులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైనందున పలు చోట్ల ఆ డబ్బాలు కనిపిస్తున్నాయి. పేదలైనా పెద్ద మనసుతో కొందరు ఆ డబ్బాల్లో తమ వంతు సాయం చే(పో)స్తున్నారు.
ఉన్నవారు కొంత ఇస్తే..లేని వారికి కొండంత..
జిల్లాలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి స్థానికంగా సరిపడినంత బియ్యం దొరకట్లేదు. బయట కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. అవసరానికన్నా ఎక్కువగా ఉన్న వారు, దొడ్డు అన్నం తినేందుకు ఇష్టపడని వారు పేదలకు సాయం చేసేందుకు విరాళం డబ్బాల్లో బియ్యం పోస్తే అవసరమున్న వారిని గుర్తించి పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దాతల ఔదార్యం వల్ల ఆకలితో అలమటించే వారికి కడుపు నిండుతుంది.
స్పందన కనిపిస్తోంది..
అధికారుల ఆలోచన ఫలిస్తోంది. తమ అవసరానికన్నా ఎక్కువ బియ్యం ఉన్నాయనుకున్న వారు రేషన్ దుకాణాల్లోని విరాళం డబ్బాల్లో పోస్తున్నారు. భైంసా ప్రాంతంలోని ఓ దుకాణంలో ఒక్క రోజులోనే 80 కిలోలకు పైగా బియ్యం అక్కడి డబ్బాలో పోశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని బుట్టాపూర్‌లోనూ స్పందన కనిపించింది.
మామడ మండలంలోనూ పలు చోట్ల కార్డుదారులు విరాళమిచ్చేందుకు ముందుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ వారం రోజుల్లో పెద్ద మొత్తంలోనే బియ్యం విరాళం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిండికి ఇబ్బంది పడుతున్న వారికి అవి చేరవేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవీ చదవండి: