అంతర్వేది రధం ఘటన తర్వాత కుట్రపూరితంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటన పై సీబీఐ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. పవన్ ఫార్మ్ హౌస్‌లో, చంద్రబాబు జూమ్‌లో ఉండి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇక్కడ మతపరమైన అంశాలను లేవదీస్తోందని విమర్శించారు.
2017 అక్టోబర్ 19న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో రథం దగ్దమైందని.... తెదేపా, భాజపా, జనసేన భాగస్వామిగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. స్వామిజీలు, రాజకీయ పార్టీల నేతలు ఈ ఘటనపై ఇక మాట్లాడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దన్న మంత్రి... సీబీఐ విచారణలో ఏం తేలుతుందో వేచి చూద్దామన్నారు.
కొందరు చర్చిలు, ఇతర ప్రార్ధన మందిరాలపై రాళ్లు వేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఫార్మ్ హౌస్‌లో కూర్చుని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, దీపాలు వెలిగిస్తే సరిపోదని వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. దేవాలయాల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమం చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే విష ప్రచారం అంతా తెదేపా కార్యాలయం నుంచే వస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు