People Rejected Formation of ACCMC: అమరావతి సిటీ కేపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాజధాని ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈనెల 5నుంచి గ్రామాల వారీగా సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. మంగళగిరి మండలంలో 3 గ్రామాలు, తుళ్లూరు మండలంలో ని 16 గ్రామాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది. అన్నిచోట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు. అమరావతిని విడగొడితే సహించేది లేదని స్పష్టం చేశారు. 29 గ్రామాలతో కూడిన సీఆర్డీఏను ఎట్టిపరిస్థితిల్లోనూ విచ్ఛిన్నం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
రెండున్నరేళ్లలో రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పెట్టని ప్రభుత్వం.. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వెనక కారణాలేంటని ప్రజలు నిలదీశారు. రాజధాని భూములు తాకట్టు పెట్టడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులతో పాటు అమరావతి ఐకాస నాయకులు సైతం ఎక్కడా అధికారులతో గొడవ పడకుండా తమ అభిప్రాయాల్ని స్పష్టంగా వినిపించారు. గ్రామసభలు ఎందుకు పెడుతున్నారని.. వాటికి ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలను ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.
తదుపరి నిర్ణయం ఎలా ఉండనుందో...?
ప్రజల ఆలోచనల్ని ప్రభుత్వం ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది. వారి ఆలోచనలకు వ్యతిరేకంగా ముందుకెళ్తుందా.. లేదా ? ఇక్కడితో కార్పొరేషన్ ప్రతిపాదన విరమించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇదీ చదవండి..