శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం మరోసారి పరీక్షలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ)కు సిఫార్సు చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాఖ్య తరపున అజయ్‌జైన్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతులు ఇచ్చినట్లు తెలిపారు. శాఖాపరమైన పరీక్షల్లో పశ్నపత్రాలు కఠినంగా ఉన్నందున పేపర్ కోడ్ 8, 10లో అర్హత మార్కులు 40కి బదులుగా 25కి తగ్గించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
పరీక్షల్లో ఉత్తీర్ణులవని 1,750 మంది గ్రేడ్-5 కార్యదర్శుల ప్రొబేషన్‌కు సంబంధించి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష కూడా మరోసారి నిర్వహించాలని కోరామని జానీ పాషా తెలిపారు. జూన్ 30లోగా ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు అందించాలన్న విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగానికి సిఫార్సు చేస్తామని అజయ్‌జైన్ హామీ ఇచ్చారని వివరించారు.
ఇదీ చదవండి:'గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలపై ఆందోళన అవసరం లేదు'