మనకున్నదాంట్లో ఎంతో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తే సంతృప్తితో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పాలనాధికారి సిక్తాపట్నాయక్ అన్నారు. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమానికి శుక్రవారం రామోజీ ఫౌండేషన్ ద్వారా రూ.1.20 లక్షల విలువైన డైనింగ్ టేబుళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలనాధికారి మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేయడం అనేది గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
‘ఈనాడు’ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని అభినందించారు. వృద్ధాశ్రమానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయసహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. తర్వాత గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన భవనాన్ని, యంత్ర పరికరాలను ఆమె ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన దెబ్బడి గుండయ్య, సుశీల స్మారకార్థం నిర్మించిన బస్సు షెల్టర్‌ను ప్రారంభించారు. సుంకిడి ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచి మహేందర్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు గౌరమ్మ పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. సర్పంచి రేవతి, ఐసీడీఎస్ పీడీ మిల్కా, వృద్ధాశ్రమ నిర్వాహకుడు దెబ్బటి అశోక్, శివన్న, గంగయ్య, పోచ్చన్న, విశ్రాంత ఉద్యోగి నర్సింగ్, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీవో దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్